Nara Lokesh: నేటి నుంచి లోకేష్ పాదయాత్ర యువగళం ప్రారంభం.. సమర శంఖం ఊదినట్లే?

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 08:30 AM

Nara Lokesh: నేటి నుంచి లోకేష్ పాదయాత్ర యువగళం ప్రారంభం.. సమర శంఖం ఊదినట్లే?

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర యువగళం ఈరోజు నుండి ప్రారంభం కాబోతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఒకరోజు ముందే కుప్పం చేరుకున్న లోకేష్ కు ఇక్కడ మహిళా కార్యకర్తలలు ఘనస్వాగతం పలికారు. కాగా, నేడు శుక్రవారం ఉదయం కుప్పంలో 10.15 గంటల సమయంలో వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు.

మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాటు ఈ సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుంది. తొలిరోజు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన యువగళం సభలో పాల్గొంటారు. సభ అనంతరం మళ్ళీ కుప్పంలో ప్రభుత్వ ఆసుపత్రి శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. రాత్రి సమయానికి ఆయన బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. మొత్తంగా తొలిరోజు లోకేష్ పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగనున్న ఈ పాదయాత్రతో మొత్తం 125కు పైగా నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్రలో కవర్ చేయనున్నారు. రాష్ట్రంలో అరాచకపాలనపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా నారా లోకేష్ యువగళం పేరుతో యాత్ర చేపట్టడంతో, పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి శ్రేణులు భారీగా కుప్పం చేరుకున్నారు.

గ్రామస్థాయి నేతల నుంచి పొలిట్ బ్యూరో సభ్యులవరకు నేతలు కుప్పం చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. కుప్పంలో వీధులన్నీ టిడిపి జెండాలు, బెలూన్లు, బ్యానర్లు, స్వాగత తోరణాలతో పసుపువర్ణంగా మారింది. లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టే వరదరాజస్వామి గుడి పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. మరోవైపు కుప్పం హెచ్ పి పెట్రోలు బంకు సమీపంలో సుమారు పదెకరాల ప్రాంగణంలో బహిరంగసభ కోసం పార్టీ సీనియర్ నేతల పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మరి లోకేష్ ఈ యాత్ర ఎలా సాగనుంది.. పార్టీకి ఎంతమేరకు మైలేజ్ ఇస్తుందో చూడాల్సి ఉంది.