Chandrababu: ముహూర్తం పెట్టేసుకొని కొట్టేసుకుందాం రండి.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ సవాల్!

Chandrababu: టైమ్ మీరు చెప్పినా సరే.. మేము చెప్పినా సరే.. ఏ సెంటరైనా.. ఏ ప్లేస్ అయినా.. ముహూర్తం పెట్టుకొని చెప్పండి కొట్టేసుకుందాం. ఈ దాగుడు మూతలు వద్దు.. పేస్ టూ పేస్ తేల్చుకుందాం. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉందే అనుకుంటున్నారా?. కాదు.. టీడీపీ అధినేత అధికార పార్టీ వైసీపీ నేతలకు విసిరిన ఓపెన్ ఛాలెంజ్. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు గన్నవరం పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గన్నవరం పర్యటనకు వెళ్ళిన ఆయన.. ప్రణాళిక ప్రకారమే గన్నవరంలో దాడులు జరిగాయని, వైసీపీ నేతలు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దొంగ దెబ్బలు.. దొంగాటలు వద్దని, లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందామంటూ బాబు వైసీపీకి సవాల్ చేశారు. పోలీసులు లేకుండా వస్తే చూసుకుందామని, వారిని పక్కన పెట్టి ధైర్యం ఉంటే సైకో కూడా రావాలని, పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదని బాబు చెప్పుకొచ్చారు.
గన్నవరంలో ధ్వంసమైన టీడీపీ ఆఫీసును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తోనే టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారని ఆరోపించారు. పెట్రోలు, రాళ్లతో వచ్చి దాడులు చేశారని విమర్శించారు. మొత్తం ఐదు కార్లు, రెండు బైకులను, టీడీపీ ఆఫీసులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని.. కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.
దాడులకు గురైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనా స్థలానికి బాధితుల కోసం ఆన్‌డ్యూటీలో వచ్చిన అడ్వకేట్ పై కూడా కేసు పెట్టారని అన్నారు. బెదిరిస్తే పారిపోయే పార్టీ తమది కాదని అన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన దొంతు చిన్నా ఇంటిపై రౌడీలు దాడి చేయడాన్ని ఖండించారు. తాను ఎయిర్ పోర్టుకు వస్తే 1000 మంది పోలీసులను పెట్టారని.. గన్నవరం ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా అని ప్రశ్నించారు. గన్నవరం సిఐ బీసీ వర్గానికి చెందినవాడైతే అట్రాసిటీ కేసులు ఎలా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.