Kotamreddy Sridhar Reddy: గన్‌మెన్‌లను సరెండర్ చేసిన కోటంరెడ్డి.. కన్నీటి పర్యంతమైన గన్‌మెన్‌లు!

Kotamreddy Sridhar Reddy: రాష్ట్ర రాజకీయాలలో నెల్లూరు పాలిటిక్స్ వేరయా అన్నట్లుగా సాగుతుంది ఏపీలో వ్యవహారం. రెబల్ ఎమ్మెల్యేల కామెంట్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా పార్టీ ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించగా.. తాజాగా కోటంరెడ్డి భద్రతను కూడా ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే.
కోటంరెడ్డికి ఉన్న నలుగురు గన్ మెన్లలో ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం రీ కాల్ చేసింది. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియా ముందుకు వచ్చి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్లను వెనక్కి తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఎవరు ఉన్నారో తనకు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అదలా ఉండగానే కోటంరెడ్డి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని ప్రకటించారు.
చెప్పినట్లుగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా అంటూ మరోసారి ఈరోజు మీడియా ముందుకొచ్చారు. గన్ మెన్లలో మిగిలిన ఇద్దరిని కూడా మీకే ఇచ్చేస్తున్నా అంటూ ప్రకటిస్తూ ఇదే మీకు రిటర్న్ గిఫ్ట్ అన్నారు. ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిన నేపథ్యంలో, తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ కోటంరెడ్డి తనకు గన్ మన్లు అక్కర్లేదని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన గన్ మెన్లు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కోటంరెడ్డిని వదిలి వెళ్లలేక కన్నీటిపర్యంతమయ్యారు.
తనను వదిలి వెళ్లేందుకు గన్ మెన్లు కన్నీటిపర్యంతమవడంతో కోటంరెడ్డి కూడా చలించిపోయారు. గన్ మన్లను హృదయానికి హత్తుకుని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి గన్ మెన్లను వెనక్కి ఇచ్చేయాలన్న తన ప్రకటనను సినిమా డైలాగు అనుకోవద్దని, ఏం చేసినా వెనక్కు తగ్గేదే లే అని తన వైఖరిని మరోసారి బలంగా చాటి చెప్పారు. దీంతో జగన్ సర్కార్ వర్సెస్ కోటంరెడ్డి అన్నట్లుగా తయారైంది ఇక్కడ వ్యవహారం.