Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి వైసీపీకి గుడ్ బై.. ఇక పచ్చ కండువా కప్పుకోవడమే బ్యాలెన్స్!

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 12:48 PM

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి వైసీపీకి గుడ్ బై.. ఇక పచ్చ కండువా కప్పుకోవడమే బ్యాలెన్స్!

Kotamreddy Sridhar Reddy: ఇంతకాలం వైఎస్ జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అనుకున్నట్లుగానే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో కూడా లీకైన సంగతి తెలిసిందే.

కాగా, వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని కార్యకర్తలతో వ్యాఖ్యానించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై అనుమానంతో తన ఫోన్‌ని ట్యాప్ చేశారని, ఇంత అవమానం జరిగాక తాను వైసీపీలో ఉండలేనని, ఇక వైసీపీని వీడుతున్నానని ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని.. తమ్ముడికి పోటీగా తాను నిలబడనని చెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండడంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని కార్యకర్తలతో చెప్పుకోస్తూ.. తన అనుచరులతో టీడీపీలో చేరుతున్నట్లు కూడా చెప్పారు.

ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పేస్తూ కూడా తాను పోటీ చేసే అంశానికి సంబంధించి చంద్రబాబుదే తుది నిర్ణయమని సంచలన ప్రకటన చేశారు. మరి దీనిపై నెల్లూరు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు?.. టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన ఎలా ఉంటుంది?.. టీడీపీ అధిష్టానాన్ని కోటంరెడ్డి ఎప్పుడు కలవనున్నారు?.. కోటంరెడ్డి తదుపరి ప్రణాళిక ఏంటన్నది ఇప్పుడు నెల్లూరు రాజకీయాలలో ఆసక్తిగా మారింది. మరోవైపు మరో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి కూడా వైసీపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఈరోజు లేదా రేపు రాజీనామా ప్రకటించడం ఖాయంగా కనిపిస్తుంది.