Viveka Murder Case: వివేకా కేసులో కీలక పరిణామం.. ఒకేసారి సీబీఐ కోర్టుకు ఐదుగురు నిందితులు

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 10:01 AM

Viveka Murder Case: వివేకా కేసులో కీలక పరిణామం.. ఒకేసారి సీబీఐ కోర్టుకు ఐదుగురు నిందితులు

Viveka Murder Case: మాజీ ఎంపీ, సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసు హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత స్పీడ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి విచారణతో అటెన్షన్ పెంచేసిన సీబీఐ ఇప్పుడు మరో బ్లాస్టింగ్ ఎపిసోడ్ కి సిద్దమైనట్లు కనిపిస్తుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఐదుగురుని ఒకేసారి కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

కడప కేంద్రకారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీచేసిన సీబీఐ, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు. కడప జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలతోపాటు బెయిల్ పై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిలకు నోటీసులు అందించారు. ఈ ఐదుగురు ఈనెల పదో తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నా రు.

ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురికి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయడంతోపాటు వారిని సీబీఐ కోర్టులో హాజరుపరచాలని కడప జైలు అధికారులకు సమాచారమందింది. భద్రత మధ్య వీరిని హైదరాబాద్ తరలించాలని జైలు అధికారులు ఏఆర్ పోలీసులను కోరగా.. బయట ఉన్న ఇద్దరిలో ఎర్రగంగిరెడ్డి శనివారం ఉదయం కడపకు వచ్చి సీబీఐ అధికారులను కలిసి సమన్లు తీసుకున్నారు. దస్తగిరి ఆదివారం నోటీసులు అందుకోనున్నాడు

కాగా, 10వ తేదీన ప్రత్యేక కోర్టులో విచారణ తర్వాత.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను తిరిగి కడప జైలుకు తరలిస్తారా, లేక హైదరాబాద్లోనే ఏదైనా జైలుకు పంపుతారా అనేది తేలాల్సి ఉంది. ఇక, ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిన తర్వాత ఐదుగురు నిందితులనూ ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి. దీంతో ఈ కేసులో ఏం జరగనుందన్నది ఆసక్తిగా మారింది.