AP Govt: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఆమోదాలు!

Kaburulu

Kaburulu Desk

February 8, 2023 | 03:53 PM

AP Govt: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఆమోదాలు!

AP Govt: సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. మోడల్‌ స్కూల్‌, ఏపీఈఆర్ఐఎస్ ఉద్యోగుల విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అలాగే జిందాల్‌ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్‌ బెర్త్‌ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, విశాఖలో పెట్టుబడుల సదస్సుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.

విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ పై కేబినెట్‌లో చర్చ జరిగింది. విద్యుత్ శాఖలో విండ్, సోలార్ ఎనర్జీకి కేబినెట్ ఆమోదముద్ర వేయగా.. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్న పలు సంక్షేమ పథకాల గైడ్ లైన్స్‌లో మంత్రివర్గం మార్పులు చేయనుంది. టీటీడీకి సంబంధించి కీలక నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవాణా శాఖలో పన్నుల పెంపుతో పాటు ఇప్పటికే జీవోలు జారీ అయిన పలు అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

2 విడతల్లో మొత్తంగా రూ.1.10 లక్షల కోట్లతో న్యూ ఎనర్జీ పార్క్, 1000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులు, వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయింపు, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు, పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులు, బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం, నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్పు, గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయగా.. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని క్యాబినెట్ నిర్ణయించింది. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపిన కేబినెట్.. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.