BRS Party: ఏపీలో భారీగా వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీలు.. సంక్రాంతి తర్వాత ఏం జరగబోతుంది?

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 05:28 PM

BRS Party: ఏపీలో భారీగా వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీలు.. సంక్రాంతి తర్వాత ఏం జరగబోతుంది?

BRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ తమ బీఆర్ఎస్ పార్టీని దేశమంతా విస్తరించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా తన పార్టీ కార్యకలాపాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఏపీ పార్టీకి అధ్యక్షుడిని కూడా ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ మరికొంతమందిని కూడా పార్టీలో చేర్చుకుంది. ఇక, ఏపీలో పార్టీ విస్తరణకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఇక్కడ నాయకులు వదులుకోవడం లేదు.

ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా.. సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలడమే కాకుండా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేస్తూ ఏపీ ప్రజలకు తమ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్లెక్సీలు వెలిశాయి.

సాటి తెలుగు రాష్ట్రం ఏపీలో పార్టీ బలోపేతానికి ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది బీఆర్ఎస్ అదిష్టానం. ఇందులో భాగంగా.. సంక్రాంతి పండగను ఏపీ బిఆర్ఎస్‌ నాయకులు వాడుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాగా.. ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించే సమయంలో సీఎం కేసీఆర్ సంక్రాంతి తర్వాత ఏపీలో మరింత చేరికలు ఉంటాయని వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా.. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ స్టెప్ ఎలా ఉండబోతుంది? భారీ చేరికలు ఉంటాయా? ఎమ్మెల్యేల స్థాయి నేతలను బీఆర్ఎస్ పార్టీ ఆకట్టుకుంటుందా? బీఆర్ఎస్ విస్తరణ ఏపీలో ఏ పార్టీకి నష్టం కలిగిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే.. ముందుగా ఏపీపై కేసీఆర్ వ్యూహం ఏంటన్నది బయటపడితే తప్ప.. ఏపీలో బీఆర్ఎస్ ఏ స్థాయిలో రాణిస్తుందో అర్ధం కాదు. ఏది ఏమైనా సంక్రాంతి అయిపోతుంది. ఏపీలో బీఆర్ఎస్ ఏం చేయబోతుందో చూడాలి.