Telangana: కేసీఆర్ సర్కార్ vs గవర్నర్ తమిళిసై.. హైకోర్టుకు చేరనున్న పంచాయతీ?

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 01:26 PM

Telangana: కేసీఆర్ సర్కార్ vs గవర్నర్ తమిళిసై.. హైకోర్టుకు చేరనున్న పంచాయతీ?

Telangana: తెలంగాణ రాజకీయాలలో రెండు రాజ్యాంగపరమైన అంశాలలో ఒకరకంగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య అగాధం కాస్త ఇప్పుడు రాజ్యాంగపరమైన వివాదంగా మారింది. చిన్న చిన్న అసంతృప్తులతో మొదలైన ఈ వివాదం కాస్త ఇప్పుడు కోర్టులలో పంచాయతీల వరకు వెళ్లేలా కనిపిస్తుంది. కేంద్రంపై ఉన్న అసంతృప్తిని కేసీఆర్ సర్కార్ ఇలా గవర్నర్ పై చూపిస్తుందనే ఆరోపణలు ఉండగా.. రాజ్యాంగపరంగా తన హక్కులను సర్కార్ పట్టించుకోవడం లేదని గవర్నర్ పంతాలకు పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటివరకు గవర్నర్ నుంచి బడ్జెట్‌కు ఆమోదం లభించలేదు. రాష్ట్ర బడ్జెట్‌కు ఇంకా గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుందని ప్రచారం జరుగుతుంది. నేడు ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని వినిపిస్తుంది. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని అధికార పార్టీ ఆరోపిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుశ్యంత్ దవే వాదనలు వినిపించేలా చర్చలు కూడా జరిగిపోయాయని తెలుస్తుంది. రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్‌కు అనుమతి ఇవ్వాలని ఈ నెల 21న గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా.. బడ్జెట్ ప్రవేశపెట్టాడానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, దానికి సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అని గవర్నర్ కార్యాలయం ఒక ఎదురు లెటర్ రాసింది.

గతంలో ఒకసారి గవర్నర్ ప్రసంగం లేకపోయినా ఆమె అనుమతి ఇచ్చారు. అయితే, వరుసగా రెండో సారి కూడా తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్​కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసినట్లు రాజ్​భవన్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్​ను ఎందుకు నిర్వహించడం లేదని ఆమె ప్రశ్నించారు. అయితే, గవర్నర్ కార్యాలయం నుంచి వెళ్లిన లెటర్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బడ్జెట్‌కు ఆమోదం తెలిపే ప్రక్రియ కూడా పెండింగ్‌లో పెట్టారు. కానీ, బడ్జెట్ కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇది హైకోర్టుకు చేరనున్నట్లు తెలుస్తుంది.