BRS Party: కేసీఆర్ పాన్ ఇండియా పాలిటిక్స్.. సినిమా రేంజిలో సక్సెస్ అయ్యేదెలా?

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 01:32 PM

BRS Party: కేసీఆర్ పాన్ ఇండియా పాలిటిక్స్.. సినిమా రేంజిలో సక్సెస్ అయ్యేదెలా?

BRS Party: సినిమాల పరంగా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయిలో చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. మన తెలుగు సినిమా రిలీజైతే బాలీవుడ్ బడా హీరోలు సైతం వెనకడుగేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్థాయిలో మనవాళ్ళు అక్కడ దుమ్ముదులిపి దంచికొడుతున్నారు. సినిమాల సంగతి పక్కనపెడితే.. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి ఓ నాయకుడు ఇప్పుడు పాన్ ఇండియా పాలిటిక్స్ కు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా జాతీయ ముద్ర వేసుకున్న సీఎం కేసీఆర్ జెండా పాతేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ముందుగా కర్ణాటక నుండి లేదు లేదు మహారాష్ట్ర నుండి కేసీఆర్ జాతీయ పార్టీ నుండి సమావేశాలు నిర్వహించనున్నారని.. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో సంక్రాంతి తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ మొదలు పెట్టనున్నారని ఏవేవో ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే.. వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు, కామెంట్స్ లేవు. దేశవ్యాప్తంగా కన్నా ముందే సొంతరాష్ట్రమైన తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి కనుక ఒకవైపు జాతీయ రాజకీయాలలో యాక్టివ్ ప్రయత్నాలు చేస్తూనే ముందు తెలంగాణ మీద ఫోకస్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.

అయితే, మన సినిమాల మాదిరే.. తెలుగు రాష్ట్రాల నాయకుడైన కేసీఆర్ పాన్ ఇండియా పాలిటిక్స్ లో సక్సెస్ సాధించేదెలా అన్నది ఈ మధ్య కాలంలో రాజకీయ వర్గాలలో చర్చగా మారిన అంశం. ఎందుకంటే ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రం నుండి సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు.. కర్ణాటక నుండి మాజీ పీఎం దేవెగౌడ, తమిళనాడు నుండి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, పశ్చిమ బెంగాల్ నుండి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ నుండి మాయావతి లాంటి వాళ్ళు చాలామంది జాతీయ రాజకీయాలలో కీలకం కావాలని ప్రయత్నించారు.

అయితే.. ఇంతకు ముందు ప్రయత్నించిన వాళ్ళతో పోలిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కొన్ని పోలికలతో పాటు కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. గతంలో ఇలా ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయికి అడుగులేసిన వాళ్లలో ఎక్కువ మంది మిగతా రాష్ట్రాల ముఖ్య పార్టీల మద్దతు కూడగట్టుకోగా.. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇటు కర్ణాటక నుండి ఢిల్లీ వరకు.. అటు పశ్చిమ బెంగాల్ వరకు కొంతమంది మద్దతు అయితే కూడగట్టుకున్నారు.

ఇక ప్రత్యేకతలు విషయానికి వస్తే.. ఇంతకు ముందు వాళ్ళెవ్వరూ ఢిల్లీ వేదికగా భారీగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోలేదు కానీ కేసీఆర్ మాత్రం ఆ పనిచేస్తున్నారు. దీనిని బట్టి కేసీఆర్ సీజనల్ నేషనల్ పాలిటిక్స్ లా కాకుండా సుదీర్ఘ అంచనాలతోనే రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా రైతులను కూడగట్టుకొనే పని చేస్తున్నారు. ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అంటూ తమ పార్టీ సిద్ధాంతమే దేశంలో రైతుల కోసం అనేలా ప్రాజెక్క్షన్ మొదలు పెట్టారు. మరి మన సినిమాల మాదిరే.. కేసీఆర్ కూడా పొలిటికల్ బాహుబలిగా అవతరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.