Telangana Cabinet: ఈనెల 9న కేసీఆర్ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్!

Telangana Cabinet: ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ మధ్యనే తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ క్యాబినెట్ లో ప్రధానంగా బడ్జెట్‌లో ఆమోదించిన పలు పథకాలు, గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి మంత్రి మండలి చర్చించనుంది.
ఈ క్యాబినెట్ భేటీలో ఇళ్ల స్థలాలు కలిగి ఉండి, సొంత ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల సాయం, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వద్దకు పలు బిల్లులు పంపగా, గవర్నర్ పెండింగ్ లో ఉంచడం ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది.
దాంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై బీఆర్ఎస్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అక్కడ ఆ వ్యవహారం ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఈ క్యాబినెట్ సమావేశంలో ఆ బిల్లులపై చర్చ, తగిన నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత జరుగుతున్న కేబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి వుంది.