Delhi Liquor Scam: ఈడీపై సుప్రీంకోర్టుకు కవిత.. పిటిషన్ విచారణ ముందే ఈడీ కేవియెట్ దాఖలు!

Kaburulu

Kaburulu Desk

March 18, 2023 | 10:52 PM

Delhi Liquor Scam: ఈడీపై సుప్రీంకోర్టుకు కవిత.. పిటిషన్ విచారణ ముందే ఈడీ కేవియెట్ దాఖలు!

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ విచారణ, ఈడీ నోటీసులపై కవిత సుప్రీంకోర్డును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు.

ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేస్తూ.. ప్రస్తుతానికి ఈడి విచార‌ణ‌పై ఎటువంటి స్టే ఇవ్వ‌లేమ‌ని కోర్టు వెల్ల‌డించింది. ఈ క్రమంలో 24న విచారణలో సుప్రీం ధర్మాసనం ఏం తీర్పు ఇవ్వనుందని ఉత్కంఠ కొనసాగుతుండగానే ఈడీనే సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.

కవిత పిటిషన్ విచారణకు రాకముందే ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. కవిత పిటిషన్ పై ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కూడా ఈడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 24న ఈ పిటిషన్ పై సుప్రీం ఎలా స్పందించనుందన్నని ఆసక్తిగా మారింది.

ఈడీ ఈ స్కాం దర్యాప్తులో యమా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నెల తొలి వారంలోనే ఈడీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమని ప్రచారం జరగగా.. ఢిల్లీ వీధుల్లో నుండి తెలంగాణ గల్లీలలో వరకూ ఇదే హాట్ టాపిక్ గా నడించింది. మార్చి17న ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా ఆమె అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. దీంతో కవితకు 20న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.