Jharkhand Fire Incident: 14 మంది సజీవ దహనం.. మృతులకు కేంద్రం రూ.2 లక్షల పరిహారం

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 11:18 AM

Jharkhand Fire Incident: 14 మంది సజీవ దహనం.. మృతులకు కేంద్రం రూ.2 లక్షల పరిహారం

Jharkhand Fire Incident: జార్ఖండ్.. ధన్‌బాద్‌లో మంగళవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 50 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మరో 50 మందికి గాయాలవగా.. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 13 అంతస్తుల అపార్ట్మెంట్ లో ఈ అగ్నిప్రమాదం జరగగా.. మొదట రెండవ అంతస్తులో మొదలైన మంటలు అన్ని ఫ్లోర్లకు వ్యాపించడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది.

పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకని పెద్ద సంఖ్యలో జనాలు అపార్ట్మెంట్ కు వచ్చినట్లు తెలుస్తుండగా.. అసలు అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఈ అపార్ట్మెంట్ లో 400 మందికిపైగా నివాసం ఉంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వారిలో చాలా మంది తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.

మొత్తం ఫైర్ ఇంజిన్లతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేయగా.. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భవనం మొత్తం తగలబడిపోగా.. ఇప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉండడంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈమధ్యే ఇలా నాలుగు అంతస్థుల భవనం అగ్నికి ఆహుతవగా కూలిపోతుందనే భయంతో నిన్న అధికారులే కూల్చేశారు. ఇప్పుడు జార్ఖండ్ భవనం కూడా దహనమైపోవడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎలా కూలిపోతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.