Janasena Party: రాజ్ భవన్‌కు వెళ్లిన జనసేనాని.. గంటపాటు గవర్నర్‌తో పవన్ కళ్యాణ్ చర్చ!

Kaburulu

Kaburulu Desk

March 13, 2023 | 10:32 PM

Janasena Party: రాజ్ భవన్‌కు వెళ్లిన జనసేనాని.. గంటపాటు గవర్నర్‌తో పవన్ కళ్యాణ్ చర్చ!

Janasena Party: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఆయన ఏపీ గవర్నర్ గా నియమితులైన తర్వాత తొలిసారి పవన్ కల్యాణ్ ఆయనను రాజ్‌భవన్ కు వెళ్లి కలిసి అభినందనలు తెలిపారు. పవన్ కల్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా మాతమ్రే కలిశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గవర్న ర్ తో పవన్ అపాయింట్‌మెంట్ దొరకడంతో ఆయన సాయంత్రం రాజ్‌భవన్ కు వెళ్లారు.

సుమారు గంట పాటు పవన్ కల్యాణ్ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులు, తాజా పరిణామాలపై పవన్ కల్యాణ్ గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తుంది. పవన్ నూతన గవర్నర్ తో భేటీ కావడం.. గంటకు పైగా చర్చించడంపై రాష్ట్ర రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది.

కాగా, రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ జరగనుంది. పవన్ కల్యాణ్ తొలిసారిగా వారాహి వాహనంతో ఈ సభకు విచ్చేయనున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ సభ ద్వారా పవన్ తన కార్యాచరణ ప్రకటిస్తారని భావిస్తున్నారు. గత మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉన్నారు. బీసీ సామాజివర్గం కార్యకర్తలతో పాటు కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

ఈరోజు కూడా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. భవిష్యత్ ప్రణాళిక, ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. రేపు జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి కూడా నేతలతో చర్చించారు. సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చిన పవన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.