BRS Party: మార్పు రావాల్సిన సమయం వచ్చింది.. అందుకే వచ్చా.. నాందేడ్ సభలో కేసీఆర్!

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 04:33 PM

BRS Party: మార్పు రావాల్సిన సమయం వచ్చింది.. అందుకే వచ్చా.. నాందేడ్ సభలో కేసీఆర్!

BRS Party: దేశంలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పెట్టానని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. నాందేడ్ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. అబ్ కీ బార్ కిసాన్‌కి సర్కార్ అనేది బీఆర్ఎస్ తొలి నినాదం. దేశంలో తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఉంది. రైతు ప్రభుత్వం ఏర్పడితేనే నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అన్నదాత ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.

స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ.. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నో మాటలు చెప్పారు కానీ మార్పులు జరగలేదన్నారు. ఇన్నేళ్ల స్వతంత్ర దేశంలో ప్రజలకు కనీసం తాగునీరు, విద్యుత్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు హలం దున్నటం కాదు.. కలం పట్టి దేశ చరిత్రను మార్చాలి. అప్పుడే దేశంలో రైతు రాజ్యం వస్తుంది. భారత్ మేధావుల దేశం. మేం బలవంతులం అనే నేతలకు పతనం తప్పదని హెచ్చరించారు.

ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదని, ప్రజలు, రైతులు గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. భారత్ పేద దేశం ఎంతమాత్రం కాదు. భారత్ అమెరికా కంటే ధనిక దేశం . భారత్ లో సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ.. ప్రజలు వంచనకు గురవుతున్నారు. భారత్ లో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి ఇంకెక్కడా లేదు. మహారాష్ట్రలో ఇన్ని నదులున్నా నీటి కరవు ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేస్తున్నది.. రాజకీయ పోరాటం కాదని.. జీవన్మరణ పోరాటమని అన్నా రు.

కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. పార్టీ కండువాలు కప్పి సీఎం వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మహిళా నేతలకు ఎమ్మెల్సీ కవితా కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఇక బహిరంగ సభ వేదికపై చత్రపతి శివాజీ, అంబేద్కర్, పూలే విగ్రహాలకు నివాళి అర్పించిన అనంతరం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కు అధికారమిస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. దేశమంతా గులాబీ జెండా ఎగరాలని, కిసాన్ సర్కార్ రావాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.