Jasmine Price in Telugu States: బాప్ రే.. బహిరంగ మార్కెట్లో కిలో మల్లెపూల ధర 15 వందలా?!

Jasmine Price in Telugu States: మగువలకు మల్లె పూలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇప్పుడంటే విరబోసుకున్న జుట్టుకు తోడు అని ఏవేవో హెయిర్ స్టేల్స్ రావడంతో మహిళలు మల్లెపూలు పెట్టుకోవడం తగ్గింది కానీ.. ఒకప్పుడు అలిగిన మగువను మచ్చిక చేసుకోవడం కోసం ప్రతి మగాడు మల్లె మూరనే ఆశ్రయించేవాడు. డిమాండ్ తగ్గడంతో మల్లె సాగు కూడా తగ్గిపోయింది. అయితే, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో మాత్రం మల్లెలకు ఎక్కడ లేని గిరాకీ వస్తుంది.
ఇప్పుడు పెళ్లీల సీజన్ కావడంతో ఇప్పుడు పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు ప్రజలు. మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. మల్లెపూలు సువాసనతో మత్తెక్కిస్తాయి. కానీ..పెరిగిన ధరలు వినియోగదారుడికి చెమటలు పట్టిస్తున్నాయి. మల్లె పంట ఆరంభం దశ కావడంతో ఇంకా పూర్తి స్థాయిలో పంట అందుబాటులోకి రాలేదు.
పెళ్లిళ్లకు పూల డిమాండ్ పెరగడంతో అందుకు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. మల్లెలు సామాన్య ప్రజలు కొందామంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. మల్లెల పంటకి పెట్టింది పేరైన కోనసీమ జిల్లాలో మల్లెపూల ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో కేజీ మల్లెపూల ధరలు రూ.1000 నుండి రూ.1200 వందలు పలుకుతున్నాయి.
అదే బహిరంగ మార్కెట్లోకి వెళ్తే కిలో మల్లెపూల ధర 15 వందలు పలుకుతోంది. వేసవి కాలంలోనే లభించే పూలు కావడంతో మగువలు అధికంగా వీటిని ఇష్టపడతారు. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా రావడంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్ పెరిగినా పంట పూర్తిగా చేతికి రాకపోవడంతో ఇప్పుడు ధరలు మండిపోతున్నాయి. ఐతే పూర్థిస్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారస్తులు.