Telangana TDP: తెలంగాణలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం.. రేవంత్ రెడ్డికి పార్టీలోకి ఆహ్వానం పలికిన కాసాని!

Telangana TDP: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. ఆ మధ్య ఖమ్మంలో టీడీపీ సభ తర్వాత తెలంగాణ టీడీపీలో కాస్త జోష్ కనిపించింది. అయితే, ఖమ్మం సభ తర్వాత సైలెంట్ అయిపోవడంతో పార్టీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.
ఈక్రమంలోనే ఇకపై ఏదొక రీతిన ప్రజలలోకి వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ టీడీపీ ఇంటింటికి తెలుగు దేశం పేరిట కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అదేవిధంగా మార్చి 29న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో టీడీపీ భారీ బహిరంగ సభ జరుగుతుందని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. అనంతరం తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం త్వరలోనే టీడీపీ స్టేట్ కమిటీ వేస్తామని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని కాసాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాగా, తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు ఉంటుందా అన్న అంశంపై స్పందించారు. పొత్తు అంశం పార్టీ అధిష్ఠానం పరిధిలోని విషయమని.. తాము రాష్ట్ర నాయకత్వం తరఫున సూచనలు, సలహాలు మాత్రమే ఇస్తామని వెల్లడించారు. అయితే అధిష్ఠానం ఆ సూచనలు, సలహాలు పాటిస్తుందా లేదా అన్నది వాళ్ళ ఇష్టమని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ టీడీపీ గురించి వచ్చిన ప్రస్తావనకు.. అది తనకు తల్లి పార్టీ అని పేర్కొన్నారు.
దీనిపై కూడా కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. తల్లి పార్టీ అని చెప్పిన రేవంత్ రెడ్డిని తిరిగి టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తల్లి పార్టీపై ప్రేమ ఉందన్న రేవంత్ కు టీడీపీ స్వాగతం పలుకుతోందని అన్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తామన్న కాసాని.. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.