Anam Ramanarayana Reddy: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు.. టీడీపీ వైపు కూర్చున్న ఎమ్మెల్యే ఆనం!

Anam Ramanarayana Reddy: వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనం హాజరయ్యే బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఆ మధ్యనే ఆయనపై అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి ఆయన స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు.
ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో మాట్లాడిన ఆనం.. నా సెక్యూరిటీ తగ్గించారు.. 2 ఏళ్ల నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. నేను యాప్ లతో ఫోన్ మాట్లాడాల్సి వస్తుంది. అసలు నన్ను ఈ భూమి మీద కూడా లేకుండా చేయాలని చూస్తున్నారని హీట్ పెంచేలా మాట్లాడారు. ఒకవైపు అదే జిల్లా నుండి మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం.. మరోవైపు ఆనం కామెంట్స్ అప్పట్లో రాజకీయాలను వేడెక్కించాయి.
కాగా, ఇప్పుడు ఆనం అధికారికంగానే వైసీపీ ఎమ్మెల్యేకు దూరమయ్యారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో అసెంబ్లీలోకి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను కాదని టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు.
ఓవైపు అధికార వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూర్చోగా.. ఆనం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల వైపు కూర్చోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నిరోజులుగా ఆనం ఆనం పార్టీ మారబోతారనే వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు అసెంబ్లీలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేల వైపు కూర్చువడంతో నో డౌట్ త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని రాజకీయ వర్గాలు ఖరారు చేసుకుంటున్నాయి.