Coronavirus Cases in India: మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ఒక్కరోజే దేశంలో 2 వేలకు పైగా కరోనా కేసులు

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 11:34 AM

Coronavirus Cases in India: మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ఒక్కరోజే దేశంలో 2 వేలకు పైగా కరోనా కేసులు

Coronavirus Cases in India: దేశంలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో 1,42,497 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 2,151 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇది గత 5 నెలల్లో ఇదే గరిష్టం కావడం విశేషం.

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకు 1,42,497 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,151 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి.

కాగా గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్‌ 28వ తేదీన 2,208 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 152 రోజుల విరామం తర్వాత ఒకే రోజులో పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. చివరగా అక్టోబర్ గతేడాది అక్టోబర్ 28న దేశంలో ఒక్కరోజే 2,208 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ క్రియాశీల కేసుల సంఖ్య 11,903కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉంది.

వైరస్ కారణంగా తాజాగా ఏడుగురు మరణించగా.. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, కేరళలో మరో ముగ్గురు మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,848కి పెరిగింది. దేశంలో ఇప్పటిదాకా 4.47 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల వ్యాక్సిన్‌లు అందజేశారు.