Gold in Borewell: పొలంలో సాగునీటి కోసం బోరును తవ్విస్తే.. బంగారం పొడి బయట పడింది!

Kaburulu

Kaburulu Desk

March 26, 2023 | 11:30 AM

Gold in Borewell: పొలంలో సాగునీటి కోసం బోరును తవ్విస్తే.. బంగారం పొడి బయట పడింది!

Gold in Borewell: మన భూగర్భంలో ఏముంటుందో మనకి తెలియదు. మన తాతల కాలం నుండి మన కుటుంబం అధీనంలో ఉన్న భూమిలో కూడా ఏముంటుందో మనం అంచనా వేయలేం. అందుకే ఇంటి పునాదుల కోసం తవ్వితే లంకె బిందెలు పడడం.. పొలంలో దుక్కి దున్నుతుండగా బంగారం నిండిన పెట్టెలు పైకి రావడం చూస్తా ఉంటాం. ఈ స్టోరీ కూడా అలాంటిదే. ఓ వ్యక్తి తన పొలంలో బోరు బావి తవ్విస్తే బంగారం రంగులో ఓ పొడి బయటపడింది. అయితే, అది ఏంటి అనేది ఇంకా తేలలేదు.

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా ఖాప్రాఖోల్ బ్లాక్ పరిధి చంచన బహాలి పంచాయతీ నందుపాల గ్రామంలో రైతు మహమ్మద్‌ జావెద్‌ మార్చి 8న తన పొలంలో ఓ బోరు బావి తవ్వించాడు. శుక్రవారం ఆ బోరు నుంచి బురద, బంగారు రంగుతో కూడిన ఓ పొడి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చూడ్డానికి అచ్చం అది బంగారంలోనే ఉంది. పసుపు వర్ణంలో ఉన్న ఆ పొడి మెరవడంతో బంగారం వస్తుందనే వార్త ఆ ప్రాంతంలో ప్రచారమైంది.

దీంతో తహసీల్దార్‌ ఆదిత్య మిశ్రాతో పాటు పలువురు అధికారులు శనివారం అక్కడకు చేరుకుని మట్టి నమూనా సేకరించి ల్యాబ్‌కు పంపించారు. పరీక్షలు జరిగాక ఇది బంగారమా లేదా వేరే ఖనిజమా అనే విషయం ఖరారవుతుందని తహసీల్దార్‌ తెలిపారు. నమూనా పరీక్షల ఫలితాలు వచ్చే వరకు బోరును కూడా సీజ్‌ చేశారు. మరోవైపు, ఇది బంగారమే అని గ్రామస్థులు సంబరపడిపోతున్నారు. ఒకవేళ అదే నిజమైతే తమ దశ మారిపోతుందని తెలిపారు. దానికి కారణం కూడా లేకపోలేదు.

గతంలో గంధమర్దన పర్వత ప్రాంతాలలో వివిధ లోహ నిల్వలు ఉన్నాయని వివిధ వేదికలున్నాయి. ఇటీవల మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో సైతం దియోగఢ్, కెంఝోర్, మయూర్భంజ్ సహా మూడు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొన్నాయి. అయితే, గ్రాఫైట్, మాంగనీస్, విలువైన రత్నాలు తప్పా బొలంగీర్ జిల్లాలో బంగార నిక్షేపాలు లేవని సర్వే పేర్కొంది. కానీ, బోలంగీర్ జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉందని స్థానికులు మాత్రం నమ్ముతున్నారు.