Uttar Pradesh: స్మార్ట్ ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ.. ఎగబడిన జనం.. షాప్ యజమాని అరెస్ట్!

Uttar Pradesh: పండగలకి పబ్బాలకి, ఇయర్ ఎండింగ్, కొత్తగా షాప్ ఓపెనింగ్ సమయంలో మొబైల్ ఫోన్లపై భారీ తగ్గింపులు, ఆఫర్లు ఇస్తుంటారు. క్లియెరెన్స్ సేల్స్ అని కూడా ఈ కామర్స్ సైట్స్ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయితే, ఇవేమీ కాకుండా ఓ మొబైల్ షాప్ యజమాని బిజినెస్ పెంచుకోవడం కోసం.. పబ్లిసిటీ కోసం విచిత్రమైన అఫర్ ఒకటి పెట్టాడు. తన షాప్ లో స్మార్ట్ ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు.
బీర్లంటే మందు బాబులు ఎగబడకుండా ఉంటారా? ఇక్కడ కూడా అదే జరిగింది. మనోడి ఆఫర్ తెగ నచ్చేసిన జనాలు షాపు ముందు బారులు తీరడంతో స్థానికంగా ప్రజలకు ఇబ్బంది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. భదోహిలో చౌరీ రోడ్‌లో మొబైల్ ఫోన్ దుకాణం నడుపుతున్న రాజేష్ మౌర్య సేల్స్ పెంచుకోవడం కోసం తన షాపులో స్మార్ట్ ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ అని ఆఫర్ ప్రకటించాడు.
అది కూడా మార్చి 3 నుంచి 7వ తేది వరకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కస్టమర్లకు పోస్టర్లు, యాడ్‌లు, పాంప్లేట్ల ద్వారా తెలియజేశాడు. ఆఫర్ బాగానే వర్కవుట్ అయింది.. సేల్స్ భారీగా పెరిగింది. అయితే, రాజేష్ అఫర్ ప్రకటించిన రోజులలో ఆదివారం(5 వ తేది) సెలవు రోజు కావడంతో చాలామంది షాప్ కి వచ్చారు. షాప్ ముందు భారీగా గుమిగూడారు.
ఫలితంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐపీసీ సెక్షన్ 151 ప్రకారం ప్రజా శాంతికి భంగం కలిగించడం కింద మౌర్యను అరెస్టు చేసిన పోలీసులు అతని దుకాణాన్ని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సోమవారం సాయంత్రం కూడా షాపు వద్ద జనాలు గుమిగూడడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.