Tamilisai Soundararajan: తమిళులు నా ప్రతిభను గుర్తించి ఉంటే కేంద్రమంత్రి అయ్యేది.. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

February 21, 2023 | 01:50 PM

Tamilisai Soundararajan: తమిళులు నా ప్రతిభను గుర్తించి ఉంటే కేంద్రమంత్రి అయ్యేది.. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు!

Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సొంతరాష్ట్రమైన తమిళనాడులో రెండు రోజులుగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. తమిళ ప్రజలు నా ప్రతిభను గుర్తించి ఉంటే.. కేంద్ర మంత్రిగా పార్లమెంట్ లో తమిళ ప్రజల కోసం పోరాడేదాన్ని అని.. తమిళులు గుర్తించకపోయినా నా ప్రతిభను కేంద్రం గురించి ఉన్నత పదవులలో కూర్చోబెట్టిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోయంబత్తూరులోని పీళమేడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ తమిళిసై ‘నా లాంటి ప్రతిభావంతులకు తమిళనాట గుర్తించకపోయినా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మా సత్తాను తెలుసుకుని గవర్నర్‌ పదవినిచ్చింది’ అని చెప్పారు. తన లాంటి వ్యక్తుల ప్రతిభాపాటవాలు వృథా కాకూడదనే కేంద్ర ప్రభుత్వం తమను గుర్తించి పదవులలో కూర్చోబెడుతోందని తమిళి సై అన్నారు. తమ ప్రతిభను తమిళ ప్రజలు గుర్తించి ఉంటే.. ఎంపీలుగా గెలిచి కేంద్రమంత్రులుగా పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడి ఉండే వాళ్లమని అన్నారు.

అంతేకాదు, ఈ కార్యక్రమానికి రెండు సెల్‌ఫోన్లు పట్టుకుని వస్తుండగా ఓ పెద్దాయన పలకరించారు. ‘రెండు సెల్‌ఫోన్లు ఎలా వాడుతున్నారు’ అని ఆయన ప్రశ్నించారు. ‘రెండు రాష్ట్రాల పాలనా వ్యవహారాలను చూస్తున్న నాకు అదో లెక్కా’ అని చెప్పాను’ అని తమిళిసై వివరించారు. తాను 48 గంటలపాటు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పిన ఆమె.. ప్రజల కోసం కష్టపడి సేవలందిస్తుంటే వార్తలుగా రావడం లేదని, కానీ ఆదివారం మహాబలిపురం కార్యక్రమంలో జారిపడితే వెంటనే అదో పెద్ద వార్తగా మారిందని తమిళిసై విమర్శించారు.

ఆదివారం జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ రాకెట్‌ ప్రయోగ కార్యక్రమానికి హాజరైన ఆమె.. నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి కిందపడి పోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపి నిలుచోబెట్టారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ తాను కిందపడిపోయినందున ఈ వార్త టీవీల్లో హైలైట్ అవుతుందంటూ అప్పుడే సరదాగా చమత్కరించారు. అదే విషయాన్ని ఈరోజు మరోసారి గుర్తుచేశారు.