Gudivada Amarnath: నిరూపిస్తే జనసేనకు నేనే విరాళం ఇస్తా.. పవన్ కు మంత్రి సవాల్

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 07:40 PM

Gudivada Amarnath: నిరూపిస్తే జనసేనకు నేనే విరాళం ఇస్తా.. పవన్ కు మంత్రి సవాల్

Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో విమర్శల ఘాటు పెంచిన ఉత్తరాంధ్ర నేతలు పవన్ టార్గెట్ గా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆ మధ్య పవన్ ఉత్తరాంధ్రలో కార్యక్రమం అనంతరం ఈ విమర్శల పదును మరింత పెరిగింది. మంత్రులు గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా పవన్ ప్రస్తావన లేకుండా వెళ్లే ప్రసక్తే ఉండదు.

ఇప్పుడు కూడా అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌కు బహిరంగ సవాల్‌ కూడా విసిరారు. నా దగ్గర 600 ఎకరాల భూమి ఉన్నట్టు ఆరోపిస్తున్న పవన్ కళ్యాణ్.. నా దగ్గర అంత భూమి ఉందని నిరూపిస్తే.. ఆ భూమిని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చేస్తానని ప్రకటించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్‌ మానుకోవాలని హితవుపలికారు.

కాపులను కట్టగట్టి చంద్రబాబుకు అమ్మే ప్రయత్నం పవన్ చేస్తున్నారని విమర్శించిన మంత్రి.. ఒక కాపు వాడిగా సలహా ఇస్తున్నా.. సీట్ల కోసం ఆరాటం కంటే పార్టీని బలోపేతం చేసి ఎదిగితే మంచిదని సలహా కూడా ఇచ్చారు. తెలుగుదేశం మూతబడితే ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం జనసేనకు ఉందని చెప్పడం విశేషం. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై కూడా మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు.

చంద్రబాబుకు ఇంటి పోరు ఎక్కువైందని.. టీడీపీ భవిష్యత్ యువనాయకుడి చేతుల్లో పెట్టాలని బాబుకు ఒత్తిడి ఎక్కువైందని.. కానీ, ఇప్పటికీ చంద్రబాబుకు మాత్రం తన మీదే ఫోకస్ ఉండాలని కోరుకుంటున్నారని.. అందుకే యువగళం పాదయాత్ర ప్రారంభమైన లోకేష్ కోసం ఇప్పటి వరకు వెళ్లలేదని అనుమానించారు. మొత్తంగా ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైసీపీ నేతలు టీడీపీ, జనసేన నేతలపై దుమ్ముదులిపేస్తున్నారు.