Union Territories: కేంద్ర పాలిత ప్రాంతాలుగా హైద‌రాబాద్‌, విశాఖ‌.. ఏంటి నిజమా?

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 05:18 PM

Union Territories: కేంద్ర పాలిత ప్రాంతాలుగా హైద‌రాబాద్‌, విశాఖ‌.. ఏంటి నిజమా?

Union Territories: తెలంగాణలో హైదరాబాద్.. ఏపీలో వైజాగ్ నగరాలు ఈ రాష్ట్రాలకే హార్ట్. అవి లేకపోతే ఈ రెండు రాష్ట్రాలకు అర్ధమే ఉండదు. తెలంగాణ లాంటి రాష్ట్రం ఇప్పుడు ఇలా అభివృద్ధిలో పరుగులు పెడుతుందటే అందుకు ప్రధాన కారణం హైదరాబాద్ నగరమే. అటు వైజాగ్ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెవెన్యూలో రెండో స్థానంలో నిలిచిన నగరం. అలాంటి ఈ రెండు నగరాలను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయనున్నారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది.

ఉమ్మ‌డి రాష్ట్ర రాజధాని గ‌డువు ముగిసిన త‌రువాత హైద‌రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుతార‌ని నిజానికి చాలా కాలంగా ప్రచారంలో ఉంది. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈ ప్రతిపాదన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు 2024 నాటికి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని ఈ ప్రచారం సారాంశం. తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేకత వచ్చే ఛాన్స్ ఉండగా ఏపీలోని విశాఖపట్టణాన్ని కూడా కేంద్ర‌పాలిత ప్రాంతం చేయ‌డానికి కేంద్రం సిద్దమ‌యింద‌ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

అంతేకాదు.. ఈ మధ్య తెలంగాణలో కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు.. అటు ఏపీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కొన్ని వ్యాఖ్యలను ఈ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతిపాదనకు ముడిపెట్టారు. జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన బండ్ల‌గూడ ఫ్లైవోర్ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ తెలంగాణకు క‌ల్ప‌త‌రువు అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఈ సభలో ఏ ఉద్దేశ్యంతో ఈ మాటలు అన్నారో కానీ.. కేంద్రంలో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదన వలనే కేటీఆర్ ఈ మాటలు అన్నారని కథలు అల్లుకున్నారు.

ఇక, ఏపీలో ఈ మధ్యనే ధర్మాన ప్రసాదరావు విశాఖను రాజధాని చేయాలి.. లేదంటే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని అయితే ఉత్తరాంధ్రను విడదీసి రాష్ట్రం చేయాలని ధర్మాన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కూడా కొందరు విశాఖ కేంద్ర పాలిత ప్రాంతమవుతుందనే సమాచారంతోనే ధర్మాన ఈ వ్యాఖ్యలు చేసారని కూడా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా దేశానికి రెండో రాజధానిగా చేస్తారని.. విశాఖలో కేంద్ర సంస్థలు భారీగా ఉన్న నేపథ్యంలో అది కూడా కేంద్రం అధీనంలోకి తీసుకోనుందని ప్రచారం జరుగుతుంది. అయితే.. ప్రస్తుతానికి ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేకపోగా.. ఎక్కడా నేతల నుండి దీని ప్రస్తావన కూడా రాలేదు. మరి ఈ ప్రచారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.