Uttar Pradesh: భార్యకు దోమలు కుడుతున్నాయని ట్వీట్.. మస్కిటో కిల్లర్ తెచ్చిచ్చిన పోలీసులు!

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 09:30 PM

Uttar Pradesh: భార్యకు దోమలు కుడుతున్నాయని ట్వీట్.. మస్కిటో కిల్లర్ తెచ్చిచ్చిన పోలీసులు!

Uttar Pradesh: ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా మారిపోయారు. పోలీసులంటే భయపడే స్థాయి నుండి ప్రజల కోసమే పోలీసులు అనేలా పేరు తెచ్చుకుంటున్నారు. పోలీసులలో కొందరు ఖాకీని చూసుకొని రెచ్చిపోయే వాళ్ళు ఉంటే.. మరికొందరు అదే ఖాకీలో ప్రజా సేవ, ప్రజల కోసం పాటు పడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకొనే స్టోరీ కూడా అలాంటిదే. ఓ వ్యక్తి తన భార్యకు దోమలు కుడుతున్నాయని పోలీసులకు ట్వీట్ చేయగా.. స్పందించిన పోలీసులు మస్కిటో కిల్లర్ తెచ్చి ఇచ్చారు.

యూపీలోని సంభల్ జిల్లాకు చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్య ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ ఆసుపత్రిలో విపరీతంగా దోమలున్నాయి. అవి తన భార్యబిడ్డలను విపరీతంగా కుట్టడంతో.. ఆ పసిబిడ్డ గుక్కపట్టి ఏడ్చింది. దీంతో అసద్ మస్కిటో కిల్లర్ కోసం వెళ్లాడు. కానీ, అప్పటికే అర్ధరాత్రి కావడంతో దుకాణాలన్ని మూసి ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక మస్కిటో కిల్లర్ కావాలని కోరుతూ యూపీ పోలీసులకు ట్వీట్ చేశాడు.

అసద్ ట్వీట్ కు పోలీసులు కూడా మానవతా దృక్పథంతో స్పందించారు. తీసుకొస్తున్నాం అంటూ వెంటనే అసద్ ఖాన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. చిటికెలో ఆసుపత్రికి వచ్చిన పోలీసులు అసద్ ఖాన్‌కు మస్కిటో కిల్లర్‌ను అందించారు. ఈ ఫోటోను ట్వీట్ చేసిన పోలీసులు ‘మాఫియా నుంచి మస్కీటో వరకు దేన్నైనా ఎదుర్కొంటాం’ అని ట్యాగ్ పెట్టారు. పోలీసుల సహాయానికి అసద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపగా.. యూపీ పోలీసులు చేసిన ఈ మంచి పనికి సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం అసద్ ఖాన్ చేసిన ట్వీట్ తో పాటు పోలీసుల రిప్లై, మస్కిటో కిల్లర్ అందిస్తూ తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.