Heavy Rains in Telangana: అకాల వడగళ్ల వాన.. నీట మునిగిన పంట.. రైతన్న దిగాలు!

Heavy Rains in Telangana: అకాల వర్షం మరోసారి రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. మండుటెండల నుండి ఒక్కసారిగా మారిన వాతావరణం వడగళ్ల వాన రైతన్నను హడలెత్తించింది. గురువారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు చోటుచేసుకుని, మధ్యాహ్నం దాటిన తర్వాత ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం పడింది. పలు ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.
దాంతో ఇప్పటికే మిర్చి కోతలు నిర్వహించి, కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిపంట తడిసి ముద్దయింది. కొందరు రైతులు వాతావరణ మార్పును గమనించక కల్లాల్లో మిర్చి పంటపై రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మిర్చి తడిసింది. మరికొందరు రైతులు అప్రమత్తమై మిర్చి రాశులపై టార్పాలిన్లు, బరకాలు కప్పి వర్షం బారిన తడవకుండా రక్షణ చర్యలు చేపట్టారు. తడిసిన పంట రంగు మారి నాణ్యత కోల్పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన వేరుశనగ పంట కూడా పలుచోట్ల అకాల వర్షాలకు తడిసి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. కొన్ని జిల్లాలలో ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. టమాటా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ పంటలకు భారీగా నష్టం వాటిల్లగా, బొప్పాయి, పుచ్చకాయ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలా పంటలు తడవడం, ధ్వంసమవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పంటలు తడిస్తే ఎవరు కొనుగోలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం కూడా ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. అయితే అకాల వర్షాలకు రైతన్నల్లు లబోదిబోమంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో చెందుతున్నారు.