Mekapati Chandrasekhar Reddy: మరోసారి గుండెనొప్పి.. ఎమ్మెల్యే మేకపాటికి తీవ్ర అస్వస్థత!

Kaburulu

Kaburulu Desk

March 31, 2023 | 01:50 PM

Mekapati Chandrasekhar Reddy: మరోసారి గుండెనొప్పి.. ఎమ్మెల్యే మేకపాటికి తీవ్ర అస్వస్థత!

Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మరోసారి ఆయన గుండెలో నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మర్రిపాడులోని ఆయన ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నైకి తరలించే ఆలోచనలో ఆయన కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీ నేత విజయ్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం.

గురువారం మేకపాటి ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వైసీపీ నేత సుబ్బారెడ్డి కూడా ఉదయగిరికి వచ్చారు. తాను లేనప్పుడు రావడం కాదని ఇప్పుడు రమ్మంటూ ప్రతి సవాళ్లు విసిరారు. ఈ క్రమంలో ఉదయగిరి వెళ్లాల్సిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారన్న కారణంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది.

దీంతో మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రెబల్ గా మారారు. ఈ తరువాత నుంచి ఉదయగిరి వైసీపీ నేతలకు ఎమ్మెల్యేకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలో పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిలో అడుగు పెట్టాలంటూ వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి సవాళ్లు విసిరారు. ఈక్రమంలో గురువారం ఎమ్మెల్యే ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో వచ్చి.. నడి రోడ్డుపై కుర్చి వేసుకుని కూర్చున్నారు. ఆ తర్వాత శుక్రవారం మళ్ళీ వైసీపీ నేతలు మరోసారి సవాళ్లు విసిరారు.

తాము లేనప్పుడు రావడం కాదని.. దమ్ముంటే ఇప్పుడు రమ్మని సుబ్బారెడ్డి మరోసారి సవాల్ చేశారు. ఈక్రమంలో మర్రిపాడులో ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఈ విషయంపై మీడియా వాళ్లు ప్రశ్నించగా తనకు ఆరోగ్యం సరిగా లేదని.. ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైకి తరలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.