Chaganti Koteswara Rao: సలహాదారుగా చాగంటి.. టీటీడీలో కీలక పదవి

Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలకపదవిని అప్పగించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ… టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడు సంవత్సరాలుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించిందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
కాగా, 2016లో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారుగా నియమించింది. అయితే చాగంటి మాత్రం పదవి స్వీకరించలేదు. ఇప్పుడు చాగంటికి టీటీడీలో సలహాదారుగా అవకాశం వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. ఉద్యోగంతో పాటు కాకినాడ వేదికగా ఎక్కువగా ప్రవచనాలు చెబుతుంటారు.