TDP-YSRCP: టీడీపీ సారధిగా జీవీ రెడ్డి.. వైసీపీ సారధి భార్గవ్ రెడ్డి.. ఇక యుద్ధమే!

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 06:29 PM

TDP-YSRCP: టీడీపీ సారధిగా జీవీ రెడ్డి.. వైసీపీ సారధి భార్గవ్ రెడ్డి.. ఇక యుద్ధమే!

TDP-YSRCP: పార్టీల అధ్యక్షులు.. కమిటీల అధ్యక్షులు ఎంత ముఖ్యమో సోషల్ మీడియా విభాగాలకు సైతం సారథులు అంతే ముఖ్యం. ఎందుకంటే సోషల్ మీడియా బలం లేకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీకి అధికారం దక్కే ఛాన్స్ ఉండదు. అందుకే పెద్ద పెద్ద వ్యూహకర్తలు కూడా సోషల్ మీడియాపైనే ముందు కన్నేస్తారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టీడీపీకి ముందు నుండి బలమైన సోషల్ మీడియా బలముంది.

అయితే.. ఇప్పుడు వైసీపీ టీడీపీకి మించిన బలం పోగుచేసుకుంది. 2019 ఎన్నికలకు ముందు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మార్గదర్శనంలో వైసీపీ బలమైన సోషల్ మీడియా వింగ్స్ ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికీ వీటి వలనే సోషల్ మీడియాలో వైసీపీ బలమైన వాయిస్ వినిపించగలుగుతుంది. ప్రస్తుతం ఈ వైసీపీ సోషల్ మీడియా విభాగానికి వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.

ఇక, టీడీపీ సోషల్ మీడియా విభాగానికి వస్తే.. ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ సోషల్ మీడియా ప్రధాన బాధ్యతలు చూస్తున్నారు. కాగా, ఇప్పుడు సోషల్ మీడియా కొత్త అధినేతగా జీవీ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న జీవీ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు కూడా అప్పగించారు. చింతకాయల విజయ్ తో పాటు జీవీ రెడ్డి కూడా టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలు పంచుకోనున్నారు.

వచ్చేది ఎన్నికల కాలం. ఇటు పార్టీతోపాటు కీలకమైన సోషల్ మీడియా విభాగంలో కొత్త రక్తాన్ని ఎక్కించాలని భావిస్తున్న చంద్రబాబు అందులో భాగంగానే జీవీ రెడ్డిని దించారు. న్యాయ విద్యతోపాటు సీఏ చేసిన జీవీ రెడ్డికి సామాజిక, రాజకీయ, వర్తమాన, ఆర్థిక వ్యవహారాలపై మంచి అవగాహనా ఉందని చెప్పుకుంటారు. దీంతో ఇక సోషల్ మీడియాలో టీడీపీ-వైసీపీ మధ్య యుద్ధమే అనిపిస్తుంది. అసలే ఎన్నికల సమయం.. ఇరు పార్టీల నేతలు ప్రజల మధ్యనే ఉండే సమయం.. కనుక.. సోషల్ మీడియాలో దుమ్ములేచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.