Gudivada Amarnath: గుర్తు పెట్టుకోండి.. సరిగ్గా రెండు నెలల్లో విశాఖ నుండి పరిపాలన!

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 03:17 PM

Gudivada Amarnath: గుర్తు పెట్టుకోండి.. సరిగ్గా రెండు నెలల్లో విశాఖ నుండి పరిపాలన!

Gudivada Amarnath: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయి ఎనిమిదేళ్ళయినా ఇప్పటికీ ఏపీకి రాజధాని అంశం పెద్ద రగడగానే ఉన్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా నిర్ణయించి తాత్కాలిక భవనాలను నిర్మించి పరిపాలన మొదలుపెట్టగా.. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అమరావతి ఒక్కటే కాదు.. మూడు రాజధానులు కావాలని అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు.

అయితే.. దీనిపై నేటికీ న్యాయ స్పష్టత లేదు. అప్పటి ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాలు.. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందాలు మూడు రాజధానులకు అడ్డంకి మారాయి. దీనిపై జనవరి నెలాఖరున కోర్టులో హియరింగ్ ఉండగా.. కోర్టు తీర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తిగా మారింది. అదలా ఉండగానే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం మా ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని.. త్వరలోనే విశాఖ నుండి పరిపాలన మొదలు పెడతామని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.

ఫిబ్రవరి లేదా మార్చిలో పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించడంతో పాటు పరిపాలన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టిందని ప్రచారం జరుగుతుండగానే.. ఉత్తరాంధ్ర మంత్రి గుడివాడ అమర్నాధ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుర్తుపెట్టుకోండి.. సరిగ్గా మరో రెండు నెలలలో విశాఖ నుండి పరిపాలన మొదలవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. మరో రెండు నెలలలో విశాఖపట్నం నుంచి పరిపాలన కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై రాజకీయ ఆసక్తి మొదలైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లును తిరిగి పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.

ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉండగా.. మార్చిలో విశాఖ వేదికగా కీలక అంతర్జాతీయ సదస్సులు జరగబోతున్నాయి. ఈ సదస్సుల కంటే ముందే.. రాజధానులపై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే.. అంతకంటే ముందు కోర్టు విచారణ.. తీర్పు ఎలా ఉండనున్నాయి.. దానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేకెత్తిస్తుంది.