Hyderabad: పెరుగుతున్న లంచ్ బాక్స్ కల్చర్.. డబ్బావాలాగా మారుతున్న బైక్ ట్యాక్సీలు

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 05:40 PM

Hyderabad: పెరుగుతున్న లంచ్ బాక్స్ కల్చర్.. డబ్బావాలాగా మారుతున్న బైక్ ట్యాక్సీలు

Hyderabad: ముంబైతో పాటు ఉత్తరాదిన మరికొన్ని నగరాలలో డబ్బావాలా అనే ఓకే కల్చర్ ఉంటుంది. ఇందులో చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకొనే వారు.. కొన్ని కొన్ని పనులకు వెళ్లిన వారు నగరంలో ఎక్కడ ఉన్నా.. వాళ్ళ ఇంటి నుండే డబ్బావాలాలు వాళ్ళు ఉన్న చోటుకి లంచ్ బాక్సులు ఇస్తారు. లోకల్ ట్రైన్, బస్సు, రిక్షా ఇలా రకరకాల వాహనాలు, బుట్టలలో డబ్బావాలాలు ఈ తరహా లంచ్ బాక్సులను అందిస్తుంటారు. వాళ్ళు వచ్చే సమయానికి ఇంట్లో లంచ్ బాక్స్ సిద్ధం చేసి పెడితే చాలు.. మిగతాది వాళ్ళే చూసుకుంటారు.

ఇప్పటి వరకు ఉత్తరాదిన ఉన్న ఈ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మొదలవుతుంది. మొన్నటి వరకు ఆఫీస్ క్యాంటీన్లు.. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడిన ఉద్యోగులు, ఇతరత్రా పనులకు వెళ్లే ప్రజలు ఇప్పుడు ఇంటి నుండే లంచ్ తెప్పించుకొనేందుకు ఇష్టపడుతున్నారు. కరోనా సమయంలో ఇంటి ఆహారానికి అలవాటు పడిన వారంతా ఇప్పుడు కూడా బయట ఆహారాన్ని తినేందుకు ఇష్టపడక ఇలా ఇంటి నుండే తెప్పించుకొనేందుకు ఇష్టపడుతున్నారు.

అయితే.. ముంబైలో లాగా హైదరాబాద్ లో డబ్బా వాలాలు లేరు కదా మరి ఎలా ఇంటి నుండి లంచ్ బాక్స్ ఉద్యోగులు ఉన్న చోటుకి వెళ్తుంది?. మనసు ఉండాలి కానీ ఉపాయాలకి తక్కువా!. ఈ మధ్య కాలంలో మహా నగరాలలో బైక్ ట్యాక్సీల కల్చర్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సంస్థలు తక్కువ ధరలకు తోడు ఆఫర్లను కూడా ప్రకటిస్తుండడంతో నగరాలలో ప్రజలు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు.

అయితే.. మరికొందరు తమ ఇంటి లొకేషన్ నుండి బైక్ ట్యాక్సీ బుక్ చేసి వాళ్ళు ఉండే చోటుకి తెచ్చి ఇవ్వమని చెప్తున్నారు. మనుషులు ఎక్కకపోయినా తమ డబ్బులు చెల్లించడంతోడు.. సౌకర్యంగా ఒక్కరే ట్రాఫిక్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే అవకాశంతో బైక్ ట్యాక్సీలు కూడా ఒకే చెప్తున్నారు. దీంతో తక్కువ ధరలోనే తమ ఇంటి ఫుడ్ తమ వద్దకి చేరుతుంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో బుక్ అయ్యే బైక్ ట్యాక్సీలలో వందకి పది శాతం ఈ తరహా లంచ్ బాక్స్ బుకింగ్స్ ఉంటున్నాయట. దీంతో త్వరలోనే ట్యాక్సీ సంస్థలు ఈ తరహా ట్రాన్స్పోట్ కూడా ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది.