AP Govt: ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు.. నేడు హైకోర్టులో పంచాయతీ!

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 09:11 AM

AP Govt: ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు.. నేడు హైకోర్టులో పంచాయతీ!

AP Govt: జీతాలు సకాలంలో వచ్చేలా చూడండి మహాప్రభో అంటూ ఏపీ ఉద్యోగ సంఘం ఒకటి గవర్నర్ బీబీ హరిచందన్ ను కలిసి విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం రోసాకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అయితే వాటిని వినియోగించకుండా గవర్న ర్ ను ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది.

ప్రభుత్వం మొత్తం 12వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిందని ఉద్యోగుల జిపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం 500 కోట్లు డ్రా చేసిందని.. గవర్నర్‌ను కలిసిన ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు. కాగా, దీనిపై సీరియస్ గా స్పందించిన ఏపీ ప్రభుత్వం మంత్రులు మూకుమ్మడిగా ఉద్యోగ సంఘం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్యను రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొన్న ఏపీ ప్రభుత్వం అసలు గవర్నర్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.

అంతేకాదు, అసలు సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో కూడా చెప్పాలని ప్రభుత్వం ఆ నోటీసులలో ఉద్యోగులను కోరింది. కాగా, ఈ నోటీసులపై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్ నోటీసు ఇవ్వవలసిన అవసరం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన గవర్నర్ ను ఆశ్రయించే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్న సూర్య నారాయణ.. షొకాజ్ నోటీసు సరికాదని ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున వేసిన ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. రాజ్యాంగ విరుద్ధంగా తామేమీ గవర్నర్ ను కలవలేదని పేర్కొన్న ఉద్యోగ సంఘాలు.. తమ హక్కులను కాపాడుకొనేందుకు రాజ్యాంగ బద్దంగానే గవర్నర్ ను కలిశామని చెప్పకొస్తున్నారు. మరి దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.