Hyderabad: సరదా కోసం వెళ్లి.. బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు.. 3 గంటల పాటు శ్రమిస్తే..

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 04:52 PM

Hyderabad: సరదా కోసం వెళ్లి.. బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు.. 3 గంటల పాటు శ్రమిస్తే..

Hyderabad: సరదా కోసం చేసే కొన్ని పనులు చివరికి ఊహించని ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంతమంది యువతి యువకులు సెల్ఫీల కోసం, రీల్స్ కోసమని ఎంతకైనా తెగిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరగగా.. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.

బ్రతుకుదెరువు కోసమని మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వచ్చిన యువకుడు.. హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో సరదా కోసం వెళ్లి కొండపై నుండి జారిపడి బండరాళ్ల మధ్య చిక్కుకున్నాడు. తిరుమలగిరి కెన్ కాలేజీ సమీపంలో రాజు అనే యువకుడు పెద్ద బండరాళ్లు కనిపించడంతో సరదాగా వాటిపైకి ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తూ జారి కిందపడి రెండు బండరాళ్ల మధ్య ఇరుకున్నాడు. బయటకు వచ్చేందుకు చాలాసేపు ప్రయత్నాలు చేసినా పెనుగులాటలో ఇంకా రాళ్ల మధ్య చిక్కుకుపోయాడు.

దీంతో తనను రక్షించాలని గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టిన పోలీసులు.. యువకుడి భూజానికి తాళ్లు కట్టి మూడు గంటలసేపు కస్టపడి సేఫ్ గా బయటకు లాగారు. అయితే, బండరాళ్ల మధ్య చాలాసేపు చిక్కుకుని పోవడం.. టెన్షన్ పడడంతో యువకుడు నీరసించిపోగా గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గాంధీ ఆసుపత్రిలో వైద్యుల చికిత్స అనంతరం రాజు తన స్వస్థలమైన మహారాష్ట్రకు వెళ్లేందుకు పోలీసులే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు వదిలిపెట్టారు. బ్రతుకు దెరువు కోసం రాష్ట్రం గాని రాష్ట్రమొచ్చి.. సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకున్న తనను కాపాడిన పోలీసులకు రాజు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సకాలంలో స్పందించి యువకుడిని కాపాడిన కానిస్టేబుళ్లను సీఐ శ్రావణ్ కుమార్ అభినందించారు.