Viral News: రూ.2 వేల నోటు లాంటి పెళ్లి కార్డు.. గోదారొళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా!

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 01:17 PM

Viral News: రూ.2 వేల నోటు లాంటి పెళ్లి కార్డు.. గోదారొళ్ల క్రియేటివిటీ మామూలుగా లేదుగా!

Viral News: వ్యంగ్యానికి, వెటకారానికి పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. మమకారానికి కూడా తామేమీ తక్కువ కాదని నిరూపిస్తారు మరికొందరు. ఇక, క్రియేటివిటీకి కూడా గోదారోళ్ళు తక్కువేం కాదు. పదిమంది మన గురించి చెప్పుకోవాలి.. పది కాలాల పాటు గుర్తిండిపోవాలని గతంలో ఘనంగా పెళ్లిళ్లు చేసేవారు. అయితే, ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియాలో వైరల్ కావాలి.. ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా మన గురించే చర్చ జరగాలి. ఇదీ ఇప్పుడు ఆలోచన. అందుకే ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

అలా మరోసారి నిరూపించిందే ఈ న్యూస్.. కాదు కాదు ఈ వెడ్డింగ్ కార్డు. ఓ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. పెళ్లి శుభలేఖలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆహ్వానించడం మామూలు కదా అనుకోకండి. ఇది అలా పోస్ట్ చేసిన వెడ్డింగ్ కార్డు కాదు.. క్రియేటివిటీ దెబ్బకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు షేర్లు చేసుకుంటున్నారు. రెండు వేల రూపాయల నోటుని పోలి ఉండేలా పెళ్లి కార్డు డిజైన్ చేయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఏడిద వెంకటేష్‌.. తన చిన్న కుమార్తె పెళ్లికి రెండు వేల రూపాయల నోటు తరహాలో శుభలేఖ అచ్చు వేయించారు.

అలాగే నోటుకు మరోవైపులా వివాహానికి సంబంధించి వివరాలు ముద్రించారు.. ఈ వెరైటీ కార్డు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అభినవి వెడ్స్ రోహిత్ అని పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె పేర్లతో పాటు పెళ్లి రోజు, పెళ్లి టైమ్ కూడా ముద్రించారు. రిషెప్షన్ ఎక్కడ.. ఆహ్వానించే వారు ఎవరు? పెళ్లి కార్డు ముద్రించిన సమయాన్ని కూడా ముద్రించారు. ఒరిజినల్ నోటులో రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా స్థానంలో ఈ వెడ్డింగ్ నోటులో రిజర్వ్ బ్యాంకు లవ్ అని కొటేషన్ రాయడం కార్డుకి హైలెట్. ఈ కార్డు సోషల్ మీడియా వైరల్ అవుతుండగా.. ఇది చూసిన గోదారోళ్ళు కామెంట్లలోనే వెటకారం కురిపిస్తున్నారు.