Khammam Accident: విషాదం.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లి.. అనంతలోకాలకు!

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 08:30 AM

Khammam Accident: విషాదం.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లి.. అనంతలోకాలకు!

Khammam Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. పెళ్ళికి ముందు నిర్వహించే ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం అని ఇంటి నుండి వెళ్లిన నలుగురు అనంతలోకాలకు వెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపుతుంది. కారు-లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇల్లెందు- మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరిని ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. రోడ్డు ప్రమాదం సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సం పేటకు చెందిన రణధీర్ ను మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు.

కాగా, ఈ ప్రమాదంలో మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ కు చెందిన రాము, కల్యాణ్, శివగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఫ్రీవెడ్డింగ్ షూట్ కోసమని భద్రాద్రిజిల్లా మోతె ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాద స్థలిలో రెండు మృతదేహాలను వెలికి తీసేందుకు కారును కట్టర్ సాయంతో కట్ చేసి వెలికి తీసినట్లు తెలుస్తుంది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.