YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణకు బదిలీ

YS Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ రద్దుపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయమై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది.
బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని.. మరోసారి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 5న గంగిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు ముగిశాయి. గత విచారణ సమయంలో తీర్పును జస్టిస్ ఎమ్‌ఆర్ షా ధర్మాసనం రిజర్వ్ చేసింది. కేసులో మెరిట్స్ ఆధారంగా బెయిల్ రద్దు చేయాలా.. వద్దా అన్న విషయాన్ని నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం ఆదేశించింది.
కాగా, ఇప్పటికే ఈ కేసు తెలంగాణ సీబీఐకి బదిలీ అయిన విషయం తెలిసిందే. 2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా వివేకా కూతురు సునీత న్యాయపోరాటంతో ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్య వహారాన్ని కూడా టీఎస్ హైకోర్టుకు బదిలీ చేసింది.
దీంతో ఇప్పుడు వివేకా హత్యకేసు వ్యవహారం మొత్తం తెలంగాణకు మారింది. ఒకవైపు సీబీఐ గంగిరెడ్డిని బెయిల్ రద్దు చేసి ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రయత్నిస్తుండగా.. ఈ కోర్టు నుండి ఆ కోర్టు.. ఆ కోర్టు నుండి ఈ కోర్టు అనేలా విచారణకు బ్రేకులు పడుతున్నాయి. మరి ఈ కేసు ఎప్పటికి తేలుతుందో.. అసలు తేలుతుందో లేదో చూడాల్సి ఉంది.