Toll Fee hiked: ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల పెంపు.. 5 నుండి 10 శాతం పెరగనున్న రేట్లు!

Toll Fee hiked: నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహదారులకు టోల్ బాదుడు మరింత పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ అధికారులు టోల్ ఛార్జ్‌లపై రివ్యూ చేసే సంగతి తెలిసిందే. కాగా, అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర టోల్ రేట్లు పెంచనున్నారు.
దీంతో వివిధ రాష్ట్రాలలో ఉన్న 58 టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. బీవోటీ కింద కాంట్రాక్టర్ల నిర్వహణలో ఉన్న మరికొన్ని టోల్‌ప్లాజాల రుసుమును జులై లేదా ఆగస్టులో సవరించనున్నట్లు తెలుస్తుంది. నేషనల్ హైవేస్ ఫీజు రూల్స్ 2008 ప్రకారం చూస్తే.. ఫీజు రేట్లు అనేవి ప్రతి ఏడాది సవరించొచ్చు. దాని ప్రకారమే ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి. కార్లు, ఇతర లైట్ వెహికల్స్‌పై టోల్ రేట్లు 5 శాతం, ఇతర హెవీ వెహికల్స్ విషయానికి వస్తే 10 శాతం పెరగనున్నాయి.
ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ వేపై ప్రతి రోజూ దాదాపు 20 వేల వాహనాలు పరుగులు పెడుతున్నాయి. వచ్చే ఆరు నెలల కాలంలో ఈ సంఖ్య 50 వేల నుంచి 60 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నేషనల్ హైవేస్ ఫీజు రూల్స్ 2008 ప్రకారం చూస్తే.. టోల్ ప్లాజాలకు దగ్గరిలో నివసించే వారికి చార్జీల మినహాయింపు అంటూ ఏమీ ఉండదు. అయితే మంత్లీ పాస్‌లు అందిస్తారు. దీని వల్ల వారికి బెనిఫిట్ కలుగుతుంది. టోల్ ప్లాజాకు 20 కి.మి దూరంలో ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అలాగే సర్వీస్ రోడ్డు యాక్సెస్ లేని వారికి కూడా ఇది వర్తిస్తుంది.
కాగా, ఏప్రిల్ 1 నుంచి కఠిన ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు వాహన తయారీ సంస్థలు కూడా ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలో మారుతీ, హీరోమోటోకార్ప్ సహా పలు ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఇటు వాహన తయారీ దారుల ధరల పెంపుకు తోడు అటు హైవే రోడ్లపై టోల్ చార్జీల పెంపు కలిసి వాహనదారులపై భారం పడనుంది.