Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 08:39 AM

Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Vatti Vasanth Kumar: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ నేత వట్టి వసంత కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్ విశాఖ‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో వట్టి సుదీర్ఘ కాలం పని చేశారు. వైఎస్ కు సన్నిహితుడుగా ఉండేవారు. వ‌సంత్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావ‌రి జిల్లా పూళ్ల గ్రామం కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించారు.

వట్టి వసంత కుమార్ 2004, 2009 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ కేబినెట్ లో 2009లో మంత్రిగా వ్యవహరించారు. ఆ తరువాత రోశయ్య.. కిరణ్ కుమార రెడ్డి కేబినెట్ లోనూ మంత్రిగా పని చేశారు. ఏపీ విభజన తర్వాత.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న వట్టి ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. ఈ క్రమంలోనే కొంత కాలంగా ఆయన విశాఖలో నివాసం ఉంటున్నారు.

అప్పటి నుండి రాజకీయాలకు దూరంగానే ఉన్న ఆయన ఆ మధ్య ఓ సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో స‌మావేశం అయ్యారు. జ‌న‌సేన పార్టీలో చేరుతున్నట్లు అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి. అయితే, ఆ ప్ర‌చారాన్ని వ‌ట్టి వసంత కుమార్ ఖండించారు. తాను ప‌వ‌న్ ను మర్యాద పూర్వకంగానే కలిశానని అన్నారు. అంతలోనే ఆనారోగ్యం పాలవ్వడం.. ఈమధ్యే ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగినట్లు తెలుస్తోంది.

మూడేళ్ల క్రితం వసంతకుమార్ సతీమణి కన్నుమూయగా.. వీళ్ళకి పిల్లలు లేకపోవటంతో బంధువుల నుంచి ఒకరిని దత్తత తీసుకున్నారు. నేడు ఇలా మరణించడం జరిగిపోయాయి. కాగా, అభిమానుల సంద‌ర్శ‌నార్థం వ‌ట్టి వసంత్ కుమార్ భౌతిక‌కాయాన్ని ఎంఎంపురం గ్రామానికి త‌ర‌లించ‌నున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వసంతకుమార్.. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టేవారు. అందువల్లే ఆయనంటే మాజీ ముఖ్యమంత్రులు ఎంతో నమ్మకంతో ఉండేవారు.