Foreign Drone Jet: శ్రీకాకుళం సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం!

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 01:10 PM

Foreign Drone Jet: శ్రీకాకుళం సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం!

Foreign Drone Jet: శ్రీకాకుళం జిల్లా సుముద్ర తీరంలో ఓ డ్రోన్‌ కలకలం రేపింది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ఓ డ్రోన్‌ జెట్ తిరుగుతూ మత్స్యకారుల కంటపడింది. దీంతో మత్య్సకారులు ఆ డ్రోన్‌ను పట్టుకుని మెరైన్‌ పోలీసులకు అప్పగించారు. ఈ డ్రోన్‌ 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రోన్‌ చిన్నపాటి విమానాన్ని పోలి ఉంది. మలటరీ డ్రోన్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

దీనిపై సీ టార్గెట్ అనే అక్షరాలు, 8001 నంబర్ రాసి ఉందని అధికారులు తెలిపారు. తీరంలో చిక్కిన డ్రోన్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో విచారిస్తున్నారు. దీనిపై నేవీ, కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు. దీన్ని పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు.

రక్షణ శాఖ క్షిపణి ప్రయోగ సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. తరహా డ్రోన్లను వాతావరణ శాఖ, అంతరిక్ష పరిశోధనలలో శాస్త్రవేత్తలు వాడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ కు ఎలాంటి కెమెరాలు లేకపోవడం, రేడియో సిగ్నల్స్ పంపే పరికరాలు ఉండడంతో దీనిని ఎవరు, ఎందుకోసం ప్రయోగించారనేది సస్పెన్స్ గా మారింది.

డ్రోన్ జెట్ పై ఉన్న అక్షరాల ఆధారంగా అధికారులు దాన్ని డీ కోడ్ చేసే పనిలో ఉండగా.. ఇంతకీ ఇది విదేశాలలో తయారైందా? లేక స్వదేశంలోనే తయారైందా అనే కోణం కూడా దర్యాప్తు చేస్తూ ఢిల్లీ అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు, తీరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రతను పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రజలు సైతం శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు.