Telangana Secretariat: కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం.. మోహరించిన 11 ఫైర్ ఇంజన్లు

Kaburulu

Kaburulu Desk

February 3, 2023 | 09:05 AM

Telangana Secretariat: కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం.. మోహరించిన 11 ఫైర్ ఇంజన్లు

Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కొత్త సచివాలయం ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ముహూర్తం కూడా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడే నిర్వహించనున్న ఈ వేడుకకు జాతీయ స్థాయి నేతలు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.

కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్ సింగ్, అంబేద్క ర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరుకానున్నారు. అంబేద్కర్ భవన్ అని నామకరణం చేసిన ఈ కొత్త సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని ఈ మధ్యనే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.

అయితే.. ప్రారంభ ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలోనే సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయం మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ప్రధాన గుమ్మటం మీద భారీగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

షార్ట్‌ సర్క్యూట్ వల్లనే సచివాలయంలో ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయంలో వుడ్ వర్క్ జరుగుతుండగా.. షార్ట్ సర్క్యూట్ వలనే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సచివాలయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఎలాంటి నష్టం కూడా జరగలేదని, అనుకున్న సమయానికే ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.