Bandi Sanjay: 6 నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. బండి హాట్ కామెంట్స్!

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 06:46 PM

Bandi Sanjay: 6 నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. బండి హాట్ కామెంట్స్!

Bandi Sanjay: గుర్తు పెట్టుకోండి మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమంతా సిద్ధంగా ఉండాలి. ఇదీ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన కామెంట్స్. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయంలో పార్టీ పోలింగ్ బూత్ కమిటీలు కీలకపాత్రను పోషిస్తాయని చెప్పిన ఆయన.. ప్రధాని మోదీ సైతం పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పని చేశారని.. పార్టీకి పోలింగ్ బూత్ కమిటీలే మూల స్తంభాలని అన్నారు.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్.. ‘సరల్ యాప్’ను ప్రారంభించారు. సరల్ ఈ యాప్ లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను పొందుపరుస్తున్నామన్న సంజయ్.. దీని భారీ ఎత్తున ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు. పోలింగ్ బూత్ కమిటీల ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

స్మార్ట్ సిటీ, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ, హరితహారం కింద కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్లిస్తోందని ఆరోపించిన బండి.. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతు బంధు డబ్బులను బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. రాజకీయాల గురించి కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడండి అని బండి సంజయ్ వెల్లడించారు.

విమర్శ, ప్రతి విమర్శల సంగతి ఎలా ఉన్నా మరో ఆరు నెలలలోనే తెలంగాణ ఎన్నికలన్న బండి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కొద్దిరోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చని గట్టి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో హీట్ పెంచుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికార బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఆలోచన లేదని చెప్తున్నా.. ఈ కామెంట్స్ మాత్రం రాష్ట్ర రాజకీయాలలో కాకరేపుతున్నాయి.