Hyderabad: ఐఏఎస్ అధికారిణి ఇంట్లో అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్.. అధికారుల వేటు!

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 01:49 PM

Hyderabad: ఐఏఎస్ అధికారిణి ఇంట్లో అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్.. అధికారుల వేటు!

Hyderabad: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో డిప్యూటీ తహశీల్దార్ చొరబడిన ఘటన హైదరాబాద్‌ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు ఆయన స్మిత సబర్వాల్ ఇంట్లోకి వెళ్లినట్లు చెప్పాడు. అయితే అసలు ఆయనెవరో ఆమెకు తెలియదు. అలాంటి వ్యక్తి రాత్రిపూట నేరుగా ఇంట్లోకి రావడంతో.. స్మిత సబర్వాల్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగగా.. ఆదివారం వరకు పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు.

జూబ్లీహిల్స్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి చొరబడ్డారు. అతన్ని చూసి స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతడి ఫ్రెండ్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఈ ఘటన గురించి స్మితా సబర్వాల్ ట్వీట్ చేయడంతో విషయం మరింత వెలుగులోకి వచ్చింది. ‘ఓ రోజు అర్ధరాత్రి నాకు భయానక అనుభవం ఎదురయింది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి చొరబడ్డాడు. ధైర్యంగా.. చాకచక్యంగా.. నన్ను నేను రక్షించుకున్నా. అందుకే ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రిపూట తలుపులు, తాళాలను చెక్ చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయండి’ అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.

కాగా, స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహశీల్ధార్ ఆనంద్ ‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే, భద్రతావలయంలో ఉండే ఐఏఎస్ అధికారి ఇంట్లోకి అర్థరాత్రి ఒక అధికారి చొరబడటంపై విమర్శలు వస్తోన్నాయి. ఒక ఐఏఎస్‌కే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తోన్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.