Mir Mukkaram Jah: టర్కీలో నిజాం వారసుడి మృతి.. హైదరాబాద్‌లో అధికారికంగా అంత్యక్రియలు

Mir Mukkaram Jah: హైదరాబాద్ సంస్థానాన్ని ఏళ్లపాటు నిజాం వంశస్థులు పాలించిన విషయం తెలిసిందే. ఇక నిజాం వంశంలో ఎనిమిదవ నిజాం ముఖరమ్ జా బహదూర్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని హైదరాబాద్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. శనివారం రాత్రి మరణించినట్లు తెలిపింది. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయనున్నట్లు నిజాం కుటుంబం ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది.
హైదరాబాద్ రాష్ట్రాన్ని, సంస్థానాన్ని పాలించిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనవడే మీర్ ముఖరమ్ ఝా. శనివారం రాత్రి 10.30కి ఆయన టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో వారసత్వంగా ఉన్న శ్మశాన వాటికలో తనను ఖననం చెయ్యాలని ముఖరం ఝా కోరుకోగా.. అయన కోరిక ప్రకారమే ఇక్కడే అంత్యక్రియలు జరగనున్నాయి.
చార్మినార్‌కి దగ్గర్లోనే ఉన్న రాయల్ సమాధుల చెంత ముఖరంను కూడా ఖననం చేయనున్నారు. అక్కడే ఏడుగురు నిజాముల సమాధులు ఉండగా.. ఇప్పుడు ఎనిమిదవ నిజాం ముఖరమ్ కూడా అక్కడికే చేరుకోనున్నారు. జనవరి 17 మంగళవారం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో హైదరాబాద్‌లో జరుపుతారు. హైదరాబాద్ లో ఫలక్‌నుమా ప్యాలెస్, ఖిల్వత్ ప్యాలెస్, కింగ్ కోఠి, చిరాన్ ప్యాలెస్ ముఖరమ్ ఝాకు చెందిన ఆస్తులే కాగా ఇప్పుడు అవన్నీ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలుగా మారిన విషయం తెలిసిందే
హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు, ఆజం ఝాకు ముఖరం ఝా జన్మించారు. ముఖరమ్ డెహ్రాడూన్‌లో స్కూల్, కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, రాయల్ మిలిటరీ అకాడమీలో ఉన్నత చదువులు చదివారు. 1954 జూన్ 14వ తేదీన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయనను వారసుడిగా ప్రకటించారు. 1967లో తన తాత మరణంతో హైదరాబాద్ 8వ నిజాంగా నిజాం మిర్ బర్కత్ అలి ఖాన్ (ముఖరం ఝా) ఆశీనులయ్యారు.
ముఖరమ్ ఝాకి ఐదుగురు భార్యలు. మొదటి భార్య ఎర్సా బిర్గిన్ కి కొన్ని కారణాల వల్ల విడాకులు ఇచ్చేశారు. 1979లో హెలెన్ సిమ్మన్స్‌ని రెండో పెళ్లి చేసుకోగా.. ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత 1992లో మాజీ మిస్ టర్కీ మనోల్యా ఓనుర్‌ని మూడో పెళ్లి చేసుకొని 1997లో విడాకులు ఇచ్చేశారు. 1992లో జమీలా బౌలారోస్, 1994లో టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఆయేషా ఓర్చెడీని వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా ఆయనకు పెద్ద ఫ్యామిలీ ఉంది. అయితే, వీరంతా నిజాం పాలనా కాలంలో లేరు కనుక నిజాం పాలనా వారసత్వం కిందకు రారని తెలుస్తుంది. ముఖరమ్ ఝా మృతితో నిజాం వారసత్వం ముగిసినట్లే అనుకోవాలి.