AP Politics: రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై.. ఎన్నికల వేళ ఎందుకీ నిర్ణయం?

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 10:13 AM

AP Politics: రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై.. ఎన్నికల వేళ ఎందుకీ నిర్ణయం?

AP Politics: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, కేంద్రమంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని అభిమానులు, అనుచరుల మధ్య వ్యక్తపరిచారు. వెంకటేశ్వరరావు ఒక్కరే కాదు.. తనతో పాటుగా తన కుమారుడు హితేష్ కూడా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు అభిమానుల మధ్య వెల్లడించారు. అయితే, ఆయన భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నారు.

నిజానికి 2014లోనే దగ్గుబాటి రాజకీయ నుండి దూరం కావాలని అనుకున్నారు. అప్పుడే రాజకీయ విరమణపై మీడియా ముఖంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తొలుత తాను, పురంధేశ్వరి ఇద్దరం కూడా రాజకీయాలనుంచి విరమించుకోవాలని అనుకున్నామని… అయితే ఎవరో ఒకరం రాజకీయాల్లో ఉంటూ సీమాంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములం కావాలని అనుకున్నామని.. అందుకే పురంధేశ్వరి రాజకీయాల్లో కొనసాగేలా, తాను వైదొలగేలా నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.

అప్పుడు ఏమైందో ఏమో కానీ.. తన వారసుడిగా హితేష్ ను రాజకీయాలకు తీసుకొచ్చి వైసీపీలో చేర్చారు. అయితే.. ఇప్పుడు ఫైనల్ గా తానూ.. తనతో పాటు కొడుకు కూడా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. బాపట్ల జిల్లా.. ఇంకొల్లులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాజకీయాలను గుడ్ బై చెప్పనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో దగ్గుబాటి నిర్ణయం కాస్త ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది.

పాత విభేదాలను దూరం పెట్టి చంద్రబాబు – దగ్గుబాటి సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అందరూ టీడీపీకి మద్దతుగా నిలుస్తారని భావిస్తున్న వేళ దగ్గుబాటి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెబుతూనే దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పుడున్న రాజకీయాలకు విలువలు లేవని.. ఇలాంటి పాలిటిక్స్‌లో ఉండటం కంటే దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నామని చెప్పారు.

ఇప్పటి రాజకీయాలకు తగ్గట్లు సర్దుకుపోవడం తన వల్ల కావట్లేదనీ, రాజకీయాలు పూర్తిగా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయని, రోజూ డబ్బుతో నడిచే రాజకీయాలు తాను చేయలేనని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేయాలని.. ఇలా విలువలు లేని రాజకీయాల్లో ఉండటం కష్టం అని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా.. ప్రజాసేవ విషయంలో మాత్రం రాజీలేదని.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ చేస్తానన్నారు.