China COVID: 90 కోట్ల మందికి కరోనా.. వణికిపోతున్న డ్రాగన్ దేశం

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 08:31 AM

China COVID: 90 కోట్ల మందికి కరోనా.. వణికిపోతున్న డ్రాగన్ దేశం

China COVID: డ్రాగన్ కంట్రీలో కరోనా వైరస్ అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. ప్రతి రోజు లక్షలాదిమంది వైరస్ బారినపడుతున్నారు. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జీరో కొవిడ్ విధానాన్ని పాటించిన చైనా ఆ తర్వాత కరోనా ఆంక్షలు సడలించి, లాక్‌డౌన్లు ఎత్తివేసింది. దీంతో వైరస్ మరింతగా చెలరేగిపోయింది. రోజూ లక్షలాదిమందిని వైరస్ చుట్టుముడుతూ చైనా దేశాన్ని మహమ్మారి వణికిస్తుంది.

తాజాగా, చైనాకు సంబంధించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. పెకింగ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ మేరకు వర్సిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్ సోకిందని వెల్లడించింది. అత్యధికంగా గాన్సూ ప్రావిన్స్ లో 91 శాతం మందికి కరోనా సోకింది.

యునాన్ ప్రావిన్స్ లో 84 శాతం మంది, కింఘాయ్ ప్రావిన్స్ లో 80 శాతం మంది వైరస్ ప్రభావానికి గురయ్యారవగా రానున్న వారంలో ఇది మరింత స్థాయికి చేరుకోనుందని చెప్తున్నారు. కాగా, చైనాలో కొత్త సంవత్సరం జనవరి నెల 23న ప్రారంభం కానుంది. ఈ పండగ నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు పట్టణాలు, నగరాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అంటువ్యాధులు అంచనా వేస్తున్నారు.

కరోనా కొత్త వేవ్ ఉధృతి రెండు నుంచి మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉండగా.. వైరస్ విషయంలో ఇప్పటి వరకు నగరాలపైనే దృష్టి పెట్టామని.. ఇకపై పట్టణాలు, పల్లెలపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చైనా ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.