Kotam Reddy Sridhar Reddy: బీఆర్ఎస్ పార్టీ నేతల సంప్రదింపులు.. కోటంరెడ్డి కీలక నిర్ణయం?

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 04:56 PM

Kotam Reddy Sridhar Reddy: బీఆర్ఎస్ పార్టీ నేతల సంప్రదింపులు.. కోటంరెడ్డి కీలక నిర్ణయం?

Kotam Reddy Sridhar Reddy: గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు ఇప్పుడు వర్గ పోరు, నేతల అసంతృప్తి తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో పేరున్న కోటంరెడ్డి ఇప్పుడు అదే వ్యాఖ్యలను ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైనా ఉపయోగించారు.

పార్టీ పదవుల నుండి తప్పించి.. భద్రతా సిబ్బందిని కూడా తగ్గించగా.. కోటంరెడ్డి స్వచ్ఛందంగా మిగతా సిబ్బందిని కూడా వెనక్కు సరెండర్ చేశారు. వైసీపీ నేతలు కోటంరెడ్డి వ్యవహారంపై తీవ్ర విమర్శలకు దిగినా కోటంరెడ్డి ఒక్కరే అందరికీ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోటంరెడ్డి ఎపిసోడ్ భారీ నష్టాన్నే మిగిల్చేలా రెచ్చిపోతూనే ఉన్నారు.

కాగా, వైసీపీకి గుడ్ బై చెప్పేసిన కోటంరెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారన్నది కూడా ఉత్కంఠగా సాగుతుంది. అవకాశం ఇస్తే టీడీపీ నుండి వచ్చే ఎన్నికలలో పోటీచేస్తానని కోటంరెడ్డి స్వయంగా చెప్పడంతో.. చంద్రబాబు నుండి ఆహ్వానం రావడం ఖాయం అనుకున్నారు. అయితే.. అదలా ఉండగానే బీఆర్ఎస్ నేతలు కోటంరెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో ప్రచారం మొదలైంది. వారు బీఆర్ఎస్‌లో చేరాలని కోటంరెడ్డికి ఆహ్వానం పంపినట్టు సమాచారం.

దీనికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. కోటంరెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కోటంరెడ్డి బీఆర్ఎస్ లో చేరితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కోటం రెడ్డినే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానున్నారని చెప్తున్నారు. అదే నిజమైతే.. కోటంరెడ్డి బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపితే జిల్లా రాజకీయాలలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ వైసీపీ, టీడీపీ బలంగా ఉండగా.. జనసేన, కాంగ్రెస్ కొంతవరకు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కోటంరెడ్డితో పాటు కాస్త పేరున్న నాయకులను చేర్చుకుంటే ఇక్కడ రాజకీయం మరోలా టర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.