Congress Party: ఆఫీసుకి అద్దె కట్టలేని కాంగ్రెస్.. అయ్యో పాపం అనేవాళ్లే లేరా?

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 03:59 PM

Congress Party: ఆఫీసుకి అద్దె కట్టలేని కాంగ్రెస్.. అయ్యో పాపం అనేవాళ్లే లేరా?

Congress Party: కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశాన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందన్నది కూడా మనం చూస్తున్నదే. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ.. దేశంలో కేవలం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచలప్రదేశ్ లలో మాత్రమే అధికారంలో ఉంది. పార్టీ ఫండ్స్ కూడా ఇచ్చేవాళ్ళు తగ్గిపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా తీవ్రంగా దిజగారిపోయిందని తెలుస్తుంది. దీనికి ఉదాహరణే ఏపీలో జరిగిన తాజా సంఘటన.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరసగా పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సంగతి తెలిసిందే. అటు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. ఏ ముహూర్తాన తెలంగాణ ప్రకటన చేసిందో కానీ.. అప్పటి నుండి తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ దిగజారిపోతూనే ఉంది. విభజనతో తమకి అన్యాయం జరిగిందని ఏపీలో ప్రజలు కాంగ్రెస్ ను లేకుండా చేస్తే.. రాష్ట్రాన్ని ఇచ్చినా తెలంగాణలో ఫలితం ఆ పార్టీకి దక్కలేదు.

దేశంలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం ఈ పార్టీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ కార్యాలయాలకు కూడా అద్దె కట్టలేని స్థితిలో ఉన్నా అయ్యో పాపం అనే వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఆస్థి పన్ను కట్టలేదని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. సుమారు 37 ఏళ్ల నుంచి, రూ.24 లక్షల మేర ఇంటి పన్ను బకాయి ఉందని ఆఫీసుకి తాళం వేశారు.

ముందుగా జీవీఎంసీ అధికారుల సమాచారంతో నగర కాంగ్రెస్ నేతలు కొందరు మంత్రులు అమర్నాధ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలను కలిసి కొంతకాలం గడువు ఇస్తే బకాయి పన్ను చెల్లిస్తామని రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ అంతలోనే జీవీఎంసీ అధికారులు తాళాలు వేయడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. గతంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ.. అందునా బడా నేతలతో కళాకలాడిన ఆ పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఇలా పన్ను బకాయిలతో తాళం పడడం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తుంది.

ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులతో ఒకప్పుడు వైభవంగా కనిపించిన అదే కార్యాలయం ఇప్పుడు ఇలా తాళం పడడం విధి వైపరీత్యం అనే మాట గుర్తొస్తుంది. టి.సుబ్బరామిరెడ్డి, ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్, గుడివాడ గుర్నాథరావు, కొణతాల రామకృష్ణ లాంటి మహామహులు అప్పట్లో ఈ ఆఫీసు నుండే పార్టీ పనులు చక్కబెట్టగా ఇప్పుడు ఈ పార్టీ ఆఫీసును అయ్యో పాపం అనే వాళ్ళు కూడా లేరా అని విశాఖ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.