Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 11:08 AM

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి సంతోక్ సింగ్ చౌదరి కన్నుమూశారు. పంజాబ్‌లోని ఫిల్లౌర్ వద్ద భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై రోడ్డుపై కుప్పకూలి పడిపోగా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన జలంధర్‌కు ఎంపీగా ఉన్నారు.

ఎంపీ మృతితో రాహుల్ గాంధీ వెంటనే జోడో యాత్రను నిలిపివేసి ఆసుపత్రికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం పంజాబ్‌లో సాగుతుంది. శనివారం ఉదయం లాధోవల్ నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో పాల్గొన్న జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ చౌదరి సంతోఖ్ సింగ్ రాహుల్ గాంధీతో పాటు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సంతోఖ్ సింగ్‌ చౌదరిని ఫగ్వారాలోని విర్క్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే అక్కడ ఆయన చనిపోయినట్టుగా కాంగ్రెస్ నేతలు దృవీకరించారు. జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పర్తాప్ సింగ్ బజ్వా తెలిపారు. సంతోఖ్ సింగ్ మరణించారనే విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ.. యాత్ర నుంచి బయలుదేరి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

సంతోఖ్ సింగ్ మరణవార్త తెలియగానే పలువురు పీసీసీ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పంజాబ్ తరలి వెళ్లారు. కాంగ్రెస్ ఎంపీ మరణవార్త సమాచారం తెలియడంతో తోటి కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుటాహుటిన పంజాబ్ బయలుదేరారు. ఎంపీ సంతోఖ్ సింగ్ హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని, ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.