SDSC: స్పేస్ సెంటర్‌లో కలకలం.. ఒకేరోజు ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 08:25 AM

SDSC: స్పేస్ సెంటర్‌లో కలకలం.. ఒకేరోజు ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

SDSC: పూర్వపు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 24 గంటలలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ సోమవారం నాడు రాత్రి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా అంతకు ముందు ఆదివారం సాయంత్రం చింతామణి అనే జవాన్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎస్ఎఫ్) చెందినవారు.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం మహాసమంద్ జిల్లా శంకర గ్రామానికి చెందిన చింతామణి (29) 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలో విధుల్లో చేరాడు. ఇటీవల నెల రోజులపాటు సెలవుపై ఇంటికెళ్లిన చింతామణి ఈ నెల 10న తిరిగొచ్చి విధుల్లో చేరాడు. షార్‌లోని పీసీఎంసీ రాడార్-1 ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట షిఫ్ట్‌కు హాజరయ్యాడు. చింతామణి రాడార్ సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి 7.30 గంటలకు కంట్రోల్‌ రూముతోనూ మాట్లాడాడు.

అంతలో ఏమైందో కానీ ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యవసర భద్రతా దళ (క్యూఆర్టీ) సిబ్బంది రాత్రి 8.30 గంటలకు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో చింతామణి ఓ చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సమస్యలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు.

ఇక, షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూములో విధుల్లో ఉన్న ఎస్సై వికాస్ సింగ్ తన తుపాకితో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకి పేలుడు శబ్దం వినిపించడంతో పరుగున అక్కడికి వెళ్లిన సహచరులకు వికాస్ సింగ్ రక్తపు మడుగులో కనిపించాడు. 30 ఏళ్ల వికాస్ సింగ్‌ది ఉత్తరప్రదేశ్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సరిగ్గా 24 గంటల వ్యవధిలో ఇలా ఇద్దరు జవాన్ల ఆత్మహత్య స్పేస్ సెంటర్ లో కలకలం రేపింది. కాగా, ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇద్దరి ఆత్మహత్యలకి కుటుంబ సమస్యలే కారణమా? లేక ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే జవాన్లు ఆత్మహత్యలు చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. మూడేళ్ల క్రితం కూడా షార్ సెంటర్ లో ఎస్ఐ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోగా.. ఈ విషయమై అప్పట్లో కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా ఒకేసారి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.