Cold Wave: చలిపులి.. ఉత్తర భారతంలో వంద మందికి పైగా బలి!

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 01:05 PM

Cold Wave: చలిపులి.. ఉత్తర భారతంలో వంద మందికి పైగా బలి!

Cold Wave: ఉత్తర భారతాన్ని చలి గజగజ లాడిస్తుంది. గత వారం రోజుల నుంచి ఉత్తర భారతం చలికి వణికిపోతుండగా.. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక వైపు చలి, మరో వైపు పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్ను పొడుచుకున్నా కంటికి కనిపించనంతగా పొగమంచు కురుస్తుండడంతో రవాణా ఎక్కడిక్కడే ఆగిపోతుంది.

మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించగా.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాలను మంచు దుప్పటి కమ్మేయగా.. ఢిల్లీలో చలిగాలుల తీవ్రత బాగా పెరిగింది. దీంతో నిరాశ్రయులు, జంతువుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఉత్తర భారతంలో కూడా ఉత్తరప్రదేశ్ లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాన్పూర్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోగా.. చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కాన్పూర్ లో వారం రోజుల్లో ఏకంగా 98 మందిని చలి బలి తీసుకుందని ఇక్కడి అధికారులు వెల్లడించారు. ఇక్కడ చలి కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చలిలో ఒక్కసారిగా రక్తపోటు పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున 60 ఏళ్ళు పైబడిన వారు బయటికి వెళ్లొద్దని వారు సూచిస్తున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యూపీలోని ఆగ్రా–లక్నో ఎక్స్ ప్రెస్ వేపై బస్సు, ట్రక్కు ఢీకొనడంతో నలుగురు చనిపోయారు. పంజాబ్​లోని మిషార్​ పుర గ్రామంలో టిప్పర్​ను కారు ఢీకొనడంతో ఐదుగురు చనిపోయారు. గంగా కెనాల్​లో కారు పడిపోవడంతో మరో ముగ్గురు మృతి చెందారు.