Delhi Weather: కోల్డ్‌ స్పెల్‌ ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 09:00 AM

Delhi Weather: కోల్డ్‌ స్పెల్‌ ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి దారుణంగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి ‘కోల్డ్‌ స్పెల్‌’ ఏర్పడగా.. మరో నాలుగు రోజుల పాటు దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఓ ప్రకటనలో వెల్లడించింది. కోల్డ్‌ స్పెల్‌ కారణంగా ఢిల్లీలో మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవగా.. మంగళవారం కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం-శనివారం మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు 4-6 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని వాతావరణ కార్యాలయం తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో బుధవారం వరకు.. ఆ తర్వాత తూర్పు రాజస్థాన్‌లోని వివిక్తలో చలిగాలుల నుండి తీవ్రమైన చలిగాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది.

ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఈరోజు నుండి గురవారం వరకు చలిగాలులు.. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్‌లలో ఈరోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో ఈరోజు, రేపు మంచు కురిసే అవకాశం ఉండగా.. పశ్చిమ బెంగాల్, సిక్కింలోని ఉప-హిమాలయ ప్రాంతాలలో రేపటి వరకు దట్టమైన పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మొత్తంగా ఉత్తర భారత ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా ఢిల్లీలో మరో 5 రోజులపాటు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గడిచిన పదేళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 15 రోజుల్లో 50 గంటల పాటు పొగమంచు కురిసింది. 2019 తర్వాత ఇంత మొత్తంలో మంచు కురవడం ఇదే తొలిసారి.